వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం..

By Sumanth KanukulaFirst Published Nov 20, 2022, 10:04 AM IST
Highlights

వైఎస్సార్ జిల్లాలోని ముద్దనూరు బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం  చెందారు.

వైఎస్సార్ జిల్లాలోని ముద్దనూరు బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం  చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. శ్రీసత్యసాయి జిల్లాలో శనివారం  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద జాతీయ రహదారి 44పై కారు కల్వర్టు గోడను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తెలంగాణలోని వరంగల్‌కు చెందిన అల్లంకు గోపీనాథ్, అతని భార్య రమ్యశ్రీ, తల్లి తారకేశ్వరిగా గుర్తించారు. 

గోపినాథ్, రమ్య ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సాహిత్, హాసినిలు ఉన్నారు. గోపినాథ్ తల్లి వారితో పాటే ఉంటూ పిల్లలను చూసుకుంటున్నారు. ఈ నెల 25న హాసిని పుట్టిన రోజును వరంగల్‌లోనే ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే వారు శనివారం ఉదయం బెంగళూరు నుంచి వరంగల్‌కు బయలుదేరారు. అయితే పర్వతదేవరపల్లి వద్ద జాతీయ రహదారి 44పై వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో గోపినాథ్- రమ్యశ్రీ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. గోపీనాథ్ తల్లి చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరి పిల్లలు సాహిత్, హాసిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

click me!