రాజధాని తరలింపుపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు విజయసాయి రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అమరావతి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధానిని తరలించాలనే నిర్ణయంపై దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: రాజ్యేంగేతర శక్తిగా, అవినీతి కేసులో ఎ2 ముద్దాయి గా ఉన్న విజయసాయి రెడ్డి రాజధానిపై ఎలా ప్రకటన చేస్తారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రశ్నించారు. క్యాబినెట్ లో చర్చించి మంత్రులు చేయాల్సిన ప్రకటనను విజయసాయి చేయడంపై జగన్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖలో భూ కబ్జాలు, దందాలు పెద్ద ఎత్తున సాగుతున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విశాఖలో ముఠాల కలకలం పేరుతో సెప్టెంబరులో వచ్చిన వార్తలపై జగన్ ఏమి చెబుతారని ఆయన అడిగారు.
శుక్రవారం 2.15గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశం లో సంక్రాంతి తర్వాత రాజధాని తరలించేలా దొంగల ముఠా నిర్ణయించిందని ఆయన చెప్పారు. ప్రజలు పండుగ ఉత్సవాలలో ఉంటారని, శాసనసభ సమావేశం పెట్టి తీసుకెళ్లాలని జగన్ చెప్పారని ఆయన అన్నారు.
బోస్టన్ కన్సల్టెన్సీ కంపెనీ గ్రూపులపై అనేక ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. ఐదు కోట్ల మంది ప్రకారం ప్రజల భవితవ్యం నిర్ణయించేందుకు అవినీతి కంపెనీకి బాధ్యత ఇస్తారా అని అడిగారు. మన ఎపి రాజధాని కోసం ఈ కంపెనీ నివేదికలు ఎలా ఇస్తుందని ఆయన అన్నారు. తమ ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని అడిగారు. జి.యన్.రావు వంద మీటర్లు కూడా నడవలేడని, పదివేల కిలోమీటర్ల నడిచారంటే.. నమ్ముతారా అని దేవినేని ఉమా అన్నారు.
జి.యన్. రావు అసలు ఎవరెవరిని కలిశారో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిస్తామని చెప్పారు. కృష్ణాజిల్లా గోపవరం కు చెందిన జీఎన్ రావు రిపోర్ట్ లో అసలు నిబద్ధత ఉందా అని ప్రశ్నించారు. ఈ నివేదిక పై సిబిఐ కూడా విచారించాలని ఆయన అన్నారు. వైయస్ సిఎం గా ఉండగా.. జగన్, విజయసాయి రెడ్డి చేసిన. అవినీతి కి ఐ.ఎ.యస్ లు జైలుకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు జగన్ ను నమ్మి సంతకాలు పెడితే.. మళ్లీ జైలు కు వెళ్లక తప్పదని అన్నిారు. జగన్ తప్పుడు నిర్ణయాలలో ఎవరూ భాగస్వామ్యులు కావద్దని ఆయన కోరారు. అవినీతి ఆరోపణలు ఉన్న సంస్థకు బాధ్యత ఎందుకిచ్చారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.జనవరి18న ఉభయసభల ద్వారా రాజధాని మార్పుకు జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు.
ఎన్నికల సమయంలో చెప్పకుండా, నవ రత్నాలలో పెట్టకుండా రాజధాని మార్చే అధికారం జగన్ కు ఎవరు ఇచ్చారని అడిగారు. పరిపాలన చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. కడప జిల్లాకు చెందిన సుబ్బారాయుడు.. విజయనగరం వాల్తేరు క్లబ్ కమిటీ కి నోటీసు ఇచ్చారని అన్నారు.
జగన్ అండ చూసుకుని ఈ తతంగం నడిపిస్తోంది వాస్తవం కాదా అని ఆయన అడిగారు. రాజధానిపై ప్రకటన చేయడానికి విజయసాయి రెడ్డి కి ఏమి అర్హత ఉందని ప్రశ్నించారు. దొంగ లెక్కలు రాసి జైలు కెళ్లినవాడు .. ఐ.ఎ.యస్ అధికారులతో కూర్చుని రాజధానిని నిర్ణయిస్తాడా అని నిలదీశారు.విశాఖపట్నం లో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనను జగన్ ఖండించాలని అన్నారు.
విశాఖలో భూములు కొనుగోళ్లు, వాల్తేరు క్లబ్, వంటి అంశాలపై సిబిఐతో విచారణ చేయించాలని అన్నారు. భీమిలి, భోగాపురం ఎయిర్ పోర్ట్ వద్ద 6వేల ఎకరాలు చేతులు మారాయని చెప్పారు. విశాఖ లో 36వేల ఎకరాల కొనుగోలులో వైసిపి ఎమ్మెల్యేలు, నేతలు ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు.
రాజధాని గ్రామాల నుంచి వెళ్లే ధైర్యం జగన్ కు లేకుండా పోయిందని, పోలీసులు డమ్మీ ట్రైల్ రన్స్ వేసుకుని... సిఎం ను తీసుకెళ్లారని చెప్పారు. సిఎం గా సచివాలయానికి రావడానికి ముళ్లకంచెలు, బారికేడ్లు పెడతారా అని అడిగారు. జగన్ తెలివి తక్కువ నిర్ణయం వల్లే కదా ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చేతకాని దద్దమ్మలు, అసమర్ధులని, మీకు సిగ్గు, శరం ఉంటే... రాజధాని ప్రాంత ప్రజల కన్నీరు చూసేవారని అన్నారు.
పదవుల కోసం పాకులాడితే వారి కన్నీళ్లు మీకు శాపాలుగా మారతాయని ధ్వజమెత్తారు. పదవుల కు రాజీనామా చేసి ప్రజలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. టిడిపి మహిళా నేతలపై దూషణలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 6093 గురించి అనురాధ మాట్లాడితే .. మల్లాది విష్ణు హెచ్చరిస్తాడా అని అడిగారు. వైసిపి నాయకులపై పోలీసులు కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.