
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయనున్నట్టుగా బీఆర్ఎస్ స్పష్టం చేసింది. అలాగే ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో బరిలో దిగనున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గురువారం ప్రకటన చేశారు. గురువారం రోజున ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయన సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్లీలో తెలుగువారికి సగర్వ వేదికగా బీఆర్‌ఎస్ భవన్ నిలవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరించాలని ప్రజలు ఆశిస్తున్నారని తోట చంద్రశేఖర్ చెప్పారు. బీజేపీ దేశంలోని ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తోందని ఆరోపించారు. న్యూఢిల్లీలోని బీఆర్‌ఎస్ కార్యాలయం రికార్డు సమయంలో నిర్మించబడిందని తెలిపారు. దేశంలో బీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించి.. చరిత్రను తిరగరాసే అనేక సందర్భాలకు వేదిక కావాలని ఆకాంక్షించారు.
జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్.. బీజేపీని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం, సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉందని ఉన్నారు. మత విబేధాలు రేకెత్తిస్తున్న బీజేపీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమికొడతామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తోట చంద్రశేఖర్ తెలిపారు.