జనసేన భవిష్యత్ నాయకులు వారే.. నిజాయితీగా పోరాడండి.. మేం అండగా ఉంటాం: పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

By telugu teamFirst Published Oct 10, 2021, 1:49 PM IST
Highlights

రాష్ట్రంలో వైసీపీకి మరోసారి చాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని, భవిష్యత్ జనసేన పార్టీదే అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అక్రమ కేసులు, ప్రలోబాలకు లొంగకుండా నిజాయితీగా పోరాడాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు ఇలాగే విజయం సాధించారని, అలాంటి వారే పార్టీ భావి నాయకులని వివరించారు.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో YCP నాయకుతల దాష్టీకాలు, అరాచకాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆ పార్టీకి మళ్లీ చాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని janasena పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వచ్చే సార్వత్రిక  ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలోనూ అధిక స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటుతా మని వివరించారు. ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో సంతనూతలపాడు నియోజకవర్గనాయకులు, జనసైనికులు, వీరమహిళలతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు.

రాజకీయాల్లో సంపాదించాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజకీయాల్లో అభిమానం, గౌరవం సంపాదించాలని తెలిపారు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో చిత్తశుద్ధి, నిజాయితీనే జనసేన నేతలను గెలిపించిందన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎన్నికల్లో నిలబడి నిజాయితీగా ప్రచారం చేసి గెలిచారని వివరించారు. అక్రమ కేసులు, ప్రలోభాలకు వారు లొంగిపోలేదని, అలాంటి వారే జనసేన పార్టీ భవిష్యత్ నాయకులని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేయడానికి కృషి చేయాలని కోరారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని దాష్టీకాలకు దిగినా లొంగిపోకుండా నిజాయితీగా పోరాటం చేయండని, అలాంటి వారికి అండగా ఉంటామని వివరించారు.

Also Read: సైదాబాద్ చిన్నారి హత్యాచారం: బాలిక కుటుంబానికి పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి జనసేన అభ్యర్థే పోటీ చేస్తారని, పార్టీ నిర్మాణం అంచెలంచెలుగా జరుగుతోందని మనోహర్ అన్నారు. ప్రతి కమిటీలో యువత, మహిళలకు పెద్దపీట వేయాలని పవన్ సూచించారని వివరించారు. ప్రకాశం జిల్లాలో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి యువత వలసలు పోవాల్సిన అగత్యం ఏర్పడిందని వైసీపీపై విమర్శలు చేశారు. రెండున్నరేళ్ల అధికారంలో వైసీపీ ఒక్క పరిశ్రమనూ రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని, వచ్చిన వారినీ బెదిరించడంతో పక్కరాష్ట్రాలకు తరలిపోయారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పాకనాటి గౌతంరాజ్, జిల్లా నాయకులు సుంకర సాయిబాబు, మలగ రమేశ్, చిట్టెం ప్రసాద్, ముత్యాల కళ్యాణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

click me!