ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా పలువురు అభిమానులు లైటింగ్ టవర్ ఎక్కారు. దీంతో ప్రధాని కల్పించుకొని ఆ టవర్ దిగాలని వారిని అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని చిలకూరిపేటలో ఎన్డీఏ కూటమి ‘ప్రజాగళం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఈ సభా వేదికపై నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసగించారు. అయితే ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.
ఓ వైపు పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. మరో వైపు సభలో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన టవర్లపైకి అభిమానులు ఎక్కారు. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ గమనించారు. వెంటనే ఆయన కల్పించుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ ఆగిపోయారు. టవర్లపై నుంచి దిగిపోవాలని వారికి సూచించారు. మీ ఉత్సాహం, ప్రాణాలు అమూల్యమైనవని, దయచేసి టవర్లపై నుంచి దిగిపోవాలని కోరారు. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అర్థం చేసుకోవాలని బతిమాలారు.
ప్రధాని సూచినతో అభిమానులు ఆ టవర్లపై నుంచి కిందికి దిగారు. తరువాత పవన్ కల్యాణ్ తిరిగి ప్రసంగించడం ప్రారంభించారు. ప్రధాని కోరిక మన్నించి దిగిపోయినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
చంద్రబాబు నాయుడి ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ‘‘నిన్ననే లోక్ సభ ఎన్నికల నగరా మోగింది. వచ్చిన వెంటనే నేను ఆంధ్రప్రదేశ్ కు వచ్చాను. కోటప్ప కొండ నుంచి మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తున్నాను. ఈ ముగ్గురి ఆశీర్వాదాలతో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రాబోతున్నాం. ఈ సారి ఎన్నికల్లో జూన్ 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఆ రోజు వచ్చే ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు ఇవ్వబోతోంది. అభివృద్ధి చెందిన భారత్ కావాలంటే, అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే మరో సారి 400 సీట్లు దాటాలి. ఎన్డీఏకు ఓట్లు వేయాలి.’’ అని అన్నారు.
‘‘ఎన్డీయే కూటమిలో వచ్చే పార్టీలతో ఎన్డీయే కూటమి బలంగా మారుతుంది. ఎన్డీయే కూటమి లక్ష్యం వికసిత భారత్. దేశంలో ఉన్న 30 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తెచ్చిన ఘనత ఎన్డీయే కే దక్కుతుంది ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆయుష్మన్ భారత్ తో అనేక మందికి వైద్యం అందించాము. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు చాలా కాలంగా ఏపీ ప్రజల కోసం కష్టపడి పని చేస్తున్నారు. వారి లక్ష్యం ఒకటే వికసిత్ భారత్ కోసం వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం. ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ అవసరాలను నెరవేరుస్తుంది. ’’ అని అన్నారు.