సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో... అఖండ మూవీ బెనిఫిట్ షో (వీడియో)

By Arun Kumar PFirst Published Dec 2, 2021, 12:41 PM IST
Highlights

సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలోని రామకృష్ణ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ బెనిఫిట్ షో వేసారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా అభిమానుల కోసం బెనిఫిట్ షో వేసారు.

గుంటూరు: ఇటీవల జగన్ సర్కార్ సినీరంగంపై కీలక నిర్ణయం తీసుకుంది. మరింత పారదర్శకత కోసమంటూ సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. టికెట్స్ ధరలు, ఆన్లైన్ విధానం, బెనిఫిట్ షోల రద్దు వంటి కీలక అంశాలు చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలను కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

అయితే ఇవాళ(గురువారం) నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా రిలీజయ్యింది. ఈ సందర్భంగా పలు థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అభిమానుల కోసం బెనిఫిట్ షోలు వేసాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతంలోని రామకృష్ణ థియేటర్లో అఖండ బెనిఫిట్ షో వేసారు. 

ప్రేక్షకుల ఒత్తిడి మేరకే akhanda movie బెనిఫిట్ షో వేసినట్లు థియేటర్ సిబ్బంది చెబుతున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సిన అధికారులు బెనిఫిట్ షో వేసినా చోద్యం చూస్తూ వుండిపోయారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

వీడియో

ప్రభుత్వం నిర్ణయించినట్లు కాకుండా nandamuri balakrishna నటించిన అఖండ మూవీ బెనిఫిట్ షో కోసం అధిక రేట్లకు టికెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. థియేటర్ నిర్వాహకులు పార్కింగ్ కి సైతం డబ్బులు వసూలు చేసారట. సీఎం నివాసానికి కూత వేటు దూరంలోనే పరిస్థితి ఇలా వుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలావుంటే ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెట్టి భారీగా టికెట్స్ ధరలు వసూలు చేస్తూ పలు థియేటర్లలో అఖండ మూవీ బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నారని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. బెనిఫిట్ షోల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

read more బాలయ్య ‘అఖండ’రివ్యూ

ఇక మరో తెలుగు స్టేట్ తెలంగాణలో కూడా అఖండ బెనిఫిట్ షో ప్రదర్శించారు. హైదరాబాద్ లోని రెండు థియేటర్లలో 'అఖండ' చిత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో 'అఖండ' బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. 

అఖండ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. ఇక బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వీరి కాంభినేషన్ లో రెండు సినిమాలు హిట్టవ్వడం, ‘అఖండ’మూడో సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా వున్నట్లు టాక్ బయటకువచ్చింది. 

రోజుకు నాలుగు షోలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చినా ఉదయం 6గంటలకు, 9 గంటలకు అఖండ షోలు ప్రదర్శించారని కేతిరెడ్డి అన్నారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో పోస్టర్స్ ముద్రించి ప్రచారం చేసి మరీ అధిక రేట్లకు టిక్కెట్స్ అమ్ముకున్నారని ఆరోపించారు. ఇలా ప్రభుత్వ ఆదేశాలను కాదని బెనిఫిట్ షోలు వేసిన థియేటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను కేతిరెడ్డి కోరారు. 
 

click me!