అమరావతిలో హైటెన్షన్... 144 సెక్షన్ విధించి భారీ పోలీస్ బందోబస్తు (వీడియో)

By Arun Kumar PFirst Published Apr 9, 2023, 8:54 AM IST
Highlights

అధికార వైసిపి ఎమ్మెల్యే సవాల్ ను స్వీకరించిన టిడిపి నేతలు అమరావతికి భారీగా చేరుకుంటుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

గుంటూరు : వైసిపి ఎమ్మెల్యే, టిడిపి మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పెదకూరపాడు నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. టిడిపి నేతలు తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సవాల్ విసిరారు.ఇవాళ(ఆదివారం) అమరేశ్వర ఆలయంలో అవినీతిపై చర్చించి స్వామివారిపై ప్రమాణం చేద్దాం... దమ్ముంటే రండి అంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్ ను స్వీకరించిన టిడిపి చర్చకు సిద్దమవుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అప్రమత్తమైన పోలీసులు అమరావతిలో 144 సెక్షన్ విధించారు. 

అమరావతిలో శనివారం రాత్రి 9 గంటల నుండి ఆదివారం రాత్రి 9 గంటల వరకు 144 సెక్షన్ అమలులో వుంటుందని డిఎస్పీ ఆదినారాయణ తెలిపారు. అమరావతిలో ఏ పార్టీవారు కూడా గుంపులు గుంపులుగా తిరగడం, ఊరేగింపులు నిషేధమని డిఎస్పీ తెలిపారు. వైసిపి, టిడిపి నాయకులెవ్వరూ చర్చలు, ప్రమాణం కోసం రావద్దని సూచించారు. అమరావతిలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. 

Latest Videos

వీడియో

అమరావతి వెళ్లకుండా టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టిడిపి నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు అందించి గృహనిర్భంధం చేసారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు నోటీసులు అందించేందుకు పోలీసులు ఇంటికి వెళ్ళారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే నోటీసులు అంటించారు. శ్రీధర్ ఎక్కడున్నారో ఆచూకీ లేకపోవడంతో ఇప్పటికే అమరావతికి చేరుకున్నారేమోనని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వీడియో

పోలీసులు కేవలం తమపైనే ఆంక్షలు విధించి నోటీసులు అందించడం, గ‌ృహనిర్బంధం చేయడంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సవాల్ చేసిన వైసిపి వాళ్ళను వదిలి తమను ఇలా అడ్డుకోవడం, ఇళ్ల వద్ద పోలీసులను మొహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 144 సెక్షన్ కేవలం తమకే వర్తిస్తుందా... స్వేచ్చగా తిరుగుతున్న వైసిపి నాయకులకు వర్తించదా అంటూ పోలీసులను నిలదీస్తున్నారు. 

అయితే అమరావతిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఎమ్మెల్యే నంబూరి స్పందించారు. వైసిపి శ్రేణులు సంయమనం పాటించాలని... శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు.తన మీద టిడిపి చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టడానికి సిద్దంగా వున్నానని... అలాగే వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్దిని కూడా ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. టిడిపి నాయకులు ఎంతమంది వచ్చినా తాను ఒక్కడినే వారితో చర్చకు వెళతానని అన్నారు. వాళ్లు కూడా గుంపులు గుంపులుగా వచ్చి ఉద్రిక్తతలు సృష్టించే కంటే ఒక్కరే చర్చకు వస్తే బావుంటుందని ఎమ్మెల్యే నంబూరి అన్నారు.  

 

click me!