విజయనగరం ఉద్దవోలులో టీచర్ కృష్ణ హత్య: అనుమానితుల ఇళ్ల ముందు ఆందోళన, టెన్షన్

By narsimha lode  |  First Published Jul 16, 2023, 11:55 AM IST

విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో ఉద్దవోలులో  కృష్ణ మృతి గ్రామంలో ఉద్రిక్తతకు కారణమైంది.


విజయనగరం: జిల్లాలోని  తెర్లాం మండలం ఉద్దవోలులో ఉపాధ్యాయుడు  కృష్ణ మృతితో  ఉద్రిక్తత నెలకొంది.శనివారంనాడు  టీచర్ కృష్ణను ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు.   రాజకీయ కక్షతోనే  కృష్ణను  ప్రత్యర్థులు హత్య చేశారని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన  వెంకటనాయుడి ఇంటిపై  స్థానికులు దాడికి దిగారు.  వెంకటనాయుడి సోదరుడు అప్పలనాయుడి ఇంటి అద్దాలు పగులగొట్టారు.  కృష్ణను  హత్యచేసినట్టుగా అనుమానిస్తున్న నిందితుల ఇళ్లపై  గ్రామస్తులు  దాడులకు దిగారు. 

కృష్ణ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.  కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.  కృష్ణను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.వెంకటనాయుడి ఇంటి ముందు  ఇవాళ  గ్రామస్తులు  ఆందోళనకు దిగారు. 

Latest Videos

undefined

ఉద్దవోలుకు  1988 నుండి 1995 వరకు  సర్పంచ్ గా పనిచేశారు. కృష్ణ. కృష్ణకు  1998లో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది.    గ్రామ రాజకీయాలపై కృష్ణకు మంచి పట్టుంది. గ్రామంలో ఎవరూ సర్పంచ్ గా ఎన్నిక కావాలన్నా కృష్ణ కీలకంగా వ్యవహరించేవారని  స్థానికులు చెబుతున్నారు.  గత ఎన్నికల్లో సర్పంచ్ గా వెంకటనాయుడు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కృష్ణ వల్లే ఓటమి పాలైనట్టుగా  వెంకటనాయుడు  వర్గం భావిస్తుందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే నిందితులపై పెట్రోల్ పోసి దగ్దం చేస్తామని  ఆందోళనకారులు వార్నింగ్ ఇచ్చారు. కృష్ణ గతంలో టీడీపీలో పనిచేశారు.  టీచర్ గా  పనిచేస్తూ కూడ కృష్ణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారని ప్రత్యర్థులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు.  గ్రామానికి చెందిన  ప్రత్యర్థి వర్గం కృష్ణపై  ఫిర్యాదు చేసింది.  తప్పుడు పత్రాలతో కృష్ణ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడని ఫిర్యాదు  చేశారు.

మరో వైపు  గ్రామంలో  నిర్మించిన  కొన్ని భవనాలకు సంబంధించి  ఫిర్యాదులు అందాయి.ఈ ఫిర్యాదుల వెనుక కృష్ణ ఉన్నాడని ప్రత్యర్థులు అనుమానిస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతుంది. గ్రామ రాజకీయాల్లో ఆధిపత్యం సాధించాలంటే  కృష్ణను అంతమొందించాలని  ప్రత్యర్థులు భావించారని ఆయన వర్గీయులు ఆరోపణలు  చేస్తున్నారు. గ్రామంలో చోటు  చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.  నిందితుల ఇళ్ల వద్ద ఆందోళన చేస్తున్నవారికి పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను పట్టుకొని శిక్షిస్తామని  కృష్ణ వర్గీయులకు  పోలీసులు హామీ ఇస్తున్నారు.

 

 

click me!