జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత: హోంమంత్రి తానేటి వనిత రావాలని గంజి ప్రసాద్ ఫ్యామిలీ పట్టు

By narsimha lode  |  First Published May 1, 2022, 11:16 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొత్తపల్లి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గంజి ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించడానికి ముందే హోం మంత్రి తానేటి వనిత రావాలని పట్టుబట్టారు.


ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి. కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నాడు టెన్షన్ చోటు చేసుకొంది. జి. కొత్తపల్లికి చెందిన వైసీపీ నేత Ganji Prasad ను ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. YCP లోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణమనే  ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ గ్రామ పరిధిలోని ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య వర్గీయులే ప్రసాద్ ను హత్య చేశారని గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గంజి ప్రసాద్ హత్య విషయం తెలుసుకొన్న గోపాలపురం ఎమ్మెల్యే Talari Venkata Rao నిన్న గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో వెంకట్రావుపై దాడికి దిగారు. టీడీపీ వర్గీయులే ఈ దాడికి వెనుక ఉన్నారని ఆయన ఆరోపించారు.

గంజి ప్రసాద్ అంత్యక్రియలను ఇవాళ నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. అయితే హోం మంత్రి Taneti Vanitha గ్రామానికి వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే  అంత్యక్రియలు నిర్వహిస్తామని కూడా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు హోంమంత్రి తానేటి వనిత దృష్టికి తీసుకొచ్చారు. అయితే తొలుత అంత్యక్రియలు నిర్వహించాలని కూడా మంత్రి వనిత కుటుంబ సభ్యులకు సమాచారం పంపారు. మీ సమస్యలను తాను పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చారని తెలుస్తుంది. అయితే గ్రామానికి వచ్చి తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే  అంత్యక్రియలు నిర్వహిస్తామని హోం మంత్రికి తెలిపారు. మరో వైపు గ్రామంలో చోటు చేసుకొన్న పరిస్థితులను కూడా పోలీసులు హోంమంత్రి వనితకు వివరించారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని గ్రామానికి వెళ్లేందుకు హోం మంత్రి వనిత నిర్ణయం తీసుకొన్నారు.

Latest Videos

గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు 144 సెక్షన్ ను కూడా విధించారు.గంజి ప్రసాద్ గతంలో టీడీపీలో ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. దీంతో బజారయ్య, గంజి ప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ ఇద్దరు నేతలు పార్టీలో తమ పట్టును నిలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రసాద్ హత్య జరిగిందనే వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.గంజి ప్రసాద్ హత్య కేసులో మండవల్లి సురేష్, హేమంత్, మోహన్ లు  శనివారం నాడు పోలీసులకు లొంగిపోయారు. అయితే ఈ కేసులో ఇంకా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.మరో వైపు ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య పేరును ఏ1 గా చేర్చారు పోలీసులు. బజారయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

click me!