పలాసలో ఉద్రిక్తత: టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టు

By telugu teamFirst Published Dec 24, 2020, 8:34 AM IST
Highlights

శ్రీకాకుళం జిల్లా పలాసలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గౌతు లచ్చన్న విగ్రహం వద్ద నిరసన చేపట్టాలనే టీడీపీ శ్రేణులను ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గౌతు లచ్చన్న విగ్రహంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళులు అర్పించి, క్షీరాభిషేకం చేయాలని తలపెట్టారు. ఈ క్రమంలో టీడీపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో అరెస్టు చేశారు. గౌతు లచ్చన్న విగ్రహం వరకు వెళ్లడానికి టీడీపీ కార్యాలయానికి చేరుకున్న గౌతు శిరీషను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని కబ్జా స్థలంలో ఏర్పాటు చేశారని, దాన్ని తొలగిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. దానిపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో గురువారం టీడీపీ పలాస పట్టణ అధ్యక్షుడు లొడగల కామేశ్వర రావు గురువారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. లచ్చన్న విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జీలు, జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరవుతారని ఆయన చెప్పారు. 

గురువారం లచ్చన్న విగ్రహం వద్ద నిరసన చేపట్టడానికి బయలుదేరుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

click me!