మొదలైన ‘రాజ్యసభ’ టెన్షన్..అభ్యర్ధులపై ఉత్కంఠ

First Published Feb 24, 2018, 7:08 AM IST
Highlights
  • ప్రస్తుత ఎంఎల్ఏల లెక్కల ప్రకారం మూడు స్ధానాల్లో టిడిపికి 2, వైసిపికి ఒక స్ధానం దక్కే అవకాశం ఉంది.

రాష్ట్రంలో రాజ్యసభ టెన్షన్ మొదలైంది. మార్చిలో మూడుస్దానాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగటానికి రంగం సిద్ధమైంది. నామినేషన్లు వేయటానికి చివరి తేది మార్చి 12. నామినేషన్ల పరిశీలన 13. మార్చి 23వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.

ప్రస్తుతం ఏపి నుండి రాజ్యసభకు చిరంజీవి, రేణుకా చౌదరి, సిఎం రమేష్ పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తోంది. కాబట్టి కొత్తగా ముగ్గురు అభ్యర్ధులు ఎంపికవ్వాలి. ప్రస్తుత ఎంఎల్ఏల లెక్కల ప్రకారం మూడు స్ధానాల్లో టిడిపికి 2, వైసిపికి ఒక స్ధానం దక్కే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని 175 ఎంఎల్ఏల్లో టిడిపికి 103 మంది ఉన్నారు. ఒక రాజ్యసభ స్ధానానికి 44 ఓట్లు అవసరం. దాని ప్రకారం టిడిపికి ఉన్న బలాన్ని చూస్తే 88 ఎంఎల్ఏలకు 2 స్ధనాలు దక్కుతాయి. అదే విధంగా వైసిపి తరపున గెలిచిన 67 మంది ఎంఎల్ఏల్లో 23 మంది ఫిరాయించారు. కాబట్టి ప్రస్తుతమున్న 44 మంది ఎంఎల్ఏలతో వైసిపికి ఒక స్ధానం దక్కుతుంది.

టిడిపికున్న బలం ప్రకారం 88 మంది ఎంఎల్ఏల ఓట్లు పోను ఇంకా 15  ఎంఎల్ఏల ఓట్లు మిగిలిపోతాయి. టిడిపికి మిగిలే 15 ఓట్లు కాకుండా మిత్రపక్షం బిజెపికి 4గురు, ఇద్దరు స్వతంత్రులు,  22 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలు కలిపి 43 మంది ఎంఎల్ఏల బలం ఉంటుంది. మూడో స్ధానాన్ని కూడా టిడిపి దక్కించుకోవాలంటే అదనంగా ఒక్క ఓటు తెచ్చుకోగలిగితే చాలు. ఒక్క ఓటు తెచ్చుకోవటమంటే మళ్ళీ ఫిరాయింపులకు తెరలేపటమే. అయితే, ప్రస్తుత పరిస్ధితుల్లో బిజెపి ఏం చేస్తుందన్నది సస్పెన్స్.

మొత్తం మూడు స్ధానాలను గెలుచుకుని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. అయితే, ఉన్న ఎంఎల్ఏలను కాపాడుకుని ఎలాగైనా తమకు దక్కాల్సిన రాజ్యసభ స్ధానాన్ని గెలుచుకోవాలని జగన్ పై ఎత్తులేస్తున్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠకు దారితీస్తోంది.

వైసిపి తరపున రాజ్యసభ అభ్యర్ధిగా నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్ ప్రకటించారు. కాగా, టిడిపి తరపున పలువురు పోటీ పడుతున్నారు. లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పేరు తాజాగా వినిపిస్తోంది. అదే సమయంలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడుతో పాటు అవకాశం కోసం పలువురు చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారు.

click me!