
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అరెస్టు చేసింది. కాపులను బిసిల్లోకి చేర్చాలంటూ ముద్రగడ గడచిన ఏడాదిగా ఆందోళనలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన ఆందోళనలతో ప్రభుత్వానికి ముద్రగడ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. దాంతో ముద్రగడ అడుగు ముందుకేసినా, వెనక్కు వేసినా ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. అసలు ఇంట్లో నుండి బయటకు వస్తే కూడా ముద్రగడను ప్రభుత్వం అరెస్టు చేసేస్తోంది.
ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న ఉద్దేశ్యంతో ఆచరణ సాధ్యం కానీ హామీలన్నింటినీ గుప్పించిన చంద్రబాబు ఇపుడు ఆ హామీల అమలు విషయంలోనే సతమతమవుతున్నారు. దాన్ని ముద్రగడ బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా బుధవారం ఉదయం అమలాపురం నుండి అంతర్వేది వరకూ కాపు సత్యాగ్రహం పేరుతో పాదయాత్ర చేద్దామని అనుకున్నారు. అందుకని ఈ రోజు స్వగ్రామమైన కిర్లంపూడి నుండి అమలాపురంకు చేరుకోవాలనుకున్నారు. సాయంత్రం ముద్రగడ తన ఇంటి నుండి బయటకు రాగానే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎవ్వరినీ కలవనీయకుండా హౌస్ అరెస్టు చేసారు.
ఎప్పుడైతే ముద్రగడ అరెస్టు వార్త వెలుగు చూసిందో వెంటనే జిల్లా అంతా ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఆయన మద్దతుదారులకు-పోలీసులకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా నలుమూలల నుండి కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు కిర్లంపూడికి చేరుకుంటున్నారు. దాంతో ఎప్పుడేమవుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.