గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత... లోకేష్ ను చుట్టుముట్టిన పోలీసులు, వాగ్వాదం (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 9, 2021, 12:55 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ ను పోలీసులు చుట్టుముట్టారు. 

విజయవాడ: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కోట అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పర్యటన ఉద్రిక్తంగా మారింంది. ఈ పర్యటన కోసం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు లోకేష్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు లోకేష్ ను వాహనాన్ని చుట్టుముట్టిన పోలీసులు నరసరావుపేటకు వెళ్లకుండా మరెక్కడికో తరలిస్తున్నారు. 

లోకేష్ వాహనాన్ని భారీగా చుట్టిముట్టారు పోలీసులు. దీంతో పోలీస్ అధికారులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. తాను పాదయాత్రో, ధర్నానో చేయడంలేదని... కేవలం ఓ బాధిత కుటుంబం పరామర్శకు వెళుతున్నానని తెలిపాడు. ఇందుకోసం తనకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని... తాను అనుమతి కావాలని అడగనిదే నిరాకరించామంటూ ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అయితే నరసరావుపేటలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లనివ్వకూడదని ఆదేశాలున్నాయని...అందువల్లే అడ్డుకుంటున్నామని పోలీసులు తెలిపారు.  

వీడియో

గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకున్న టిడిపి శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో అక్కడినుండి తరలించారు. భారీగా పోలీసులు వాహనాలు లోకేష్ కాన్వాయ్ ని చుట్టుముట్టి విమానాశ్రయం వద్దనుండి ఎక్కడికో తరలించారు. 

read more  గుంటూరు మహిళపై గ్యాంగ్ రేప్ దారుణం...బాధితులతో పోలీసుల తీరు మరీ ఘోరం: లోకేష్ సీరియస్

ఇప్పటికే గన్నవరం ఎయిర్ పోర్ట్ బయట తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇతర ప్రయాణికులను కూడా అడ్డుకున్నారు. తమవారికి వీడ్కోలు పలకడానికి వెళ్తున్న కుటుంబ సభ్యులను విమానాశ్రయం బయటే ఆపేస్తున్నారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు ఎయిర్ పోర్ట్ వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు. దీంతో గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

కోవిడ్ నేపద్యంలో నారా లోకేష్ పర్యటన కు అనుమతి లేదు అంటున్న గుంటూరు పోలీసులు ఎక్కడికక్కడ టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి, టిడిపి నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్,  గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి భచ్చుల అర్జునుడుతో పాటు సీనియర్ నాయకులు బడేటి రాధాక్రుష్ణయ్య(చంటి) ని ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా గన్నవరం విమానాశ్రయం, నరసరావుపేటకు చేరుకోడానికి ప్రయత్నిస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.  

 

click me!