విషాదం : చలాకీతనంతో సీఎం దృష్టిని ఆకర్షించిన చిన్నారి.. అంతలోనే డెంగీతో మృతి..

By Bukka Sumabala  |  First Published Sep 2, 2022, 7:16 AM IST

అల్లూరి జిల్లాలో ఓ చిన్నారి డెంగ్యూతో మృతి చెందింది. ఈ చిన్నారి గతనెల జగన్ పర్యటన సందర్భంగా చలాకీగా తిరుగుతూ.. జగన్ దృష్టిని ఆకర్షించడంతో ఆయన దగ్గరికి పిలిచి మాట్లాడడంతో అందరికీ పరిచయం అయ్యింది. 


అల్లూరి సీతారామరాజు జిల్లా : విషజ్వరాలు, సీజనల్ వ్యాధుల్ని మనుషుల్ని ఉన్నఫళాన ఎలా మాయం చేసేస్తాయో చెప్పే ఘటన ఇది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి కంట కన్నీరు పెట్టిస్తోంది. విన్నవారందర్నీ విషాదంలో ముంచేస్తోంది. విషయం ఏంటంటే.. ఓ చిన్నారి నెల రోజుల క్రితం చలాకీగా ఉంది.. అంతలోనే పదేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్ళు నిండిపోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో చలాకీగా సందడి చేసిన బాలిక గురువారం డెంగ్యూ జ్వరంతో మృతిచెందింది. 

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయిగూరు గ్రామానికి చెందిన కారం సంధ్య (10) చింతూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. జూలై 27న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చింతూరు మండలం కుయిగూరు పర్యటనకు వచ్చినప్పుడు చురుగ్గా తిరుగుతూ ఆయన దృష్టిని ఆకర్షించింది. దీంతో ముఖ్యమంత్రి దగ్గరకు పిలిచి ఆ చిన్నారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాంటి చురుకైన బాలిక  అంతలోనే మృత్యువాత పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.  ఆమె తండ్రి  కల్లేరు మాజీ సర్పంచి కారం ఏసుబాబు. 

Latest Videos

undefined

మద్యం వినియోగం తగ్గింది.. ఎర్ర‌చందనం విక్ర‌యాల‌కు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆయన కుటుంబం కొయిగూరులో నివాసముంటోంది. నాలుగు రోజుల క్రితం ఏసుబాబుకు డెంగ్యూ సోకడంతో భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.  కుమార్తె సంధ్య తండ్రిని చూసుకుంటూ ఆయనతోపాటు ఉంది. వ్యాధి నయం కావడంతో ఏసుబాబు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. అదేరోజున బాలికకు నలతగా ఉండటంతో అక్కడే పరీక్షలు నిర్వహించిన వైద్యులు మామూలు జ్వరమే అని చెప్పారు. దాంతో వారు ఇంటికి వచ్చేసారు. బుధవారం ఆమె జ్వరంతో వణికిపోతూ ఉండడంతో చింతూరు ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి ప్రైవేట్ ల్యాబ్ లో రక్త పరీక్షలు చేయగా డెంగీ గా నిర్ధారించారు. 

భద్రాచలం వెళ్లాలని సూచించడంతో వెంటనే అక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తిరిగి ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా పరిస్థితి మరింత విషమించింది. చివరికి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. వరదలు వచ్చిన తర్వాత విలీన మండలాల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందక పోవడంతో ఈ గ్రామంలో ఐదుగురు జ్వరాలతో మృత్యువాతపడ్డారు. 

click me!