
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తు నిర్వాహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఎల్లుండి 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు మండలాల వివరాలతో కూడిన డేటాను విడుదల చేసింది. విజయనగరం, ఉమ్మడి విశాఖ, గోదావరి, ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో ఊష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది.
తీవ్రవడగాల్పులు వీచే జాబితాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, అనకాపల్లి జిల్లాలో 8, బాపట్ల జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 13, ఏలూరు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 13, కాకినాడ జిల్లాలో 18, కొనసీమ జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 18, ఎన్టీఆర్ జిల్లాలో 8, పల్నాడు జిల్లాలో 2, పార్వతీపురం మన్యం జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 3 మండలాలు ఉన్నాయి.
అలాగే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జిల్లాలు, మండల అధికారులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వృద్దులు, పిల్లలు, గర్భిణులు, బాలింతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఇక, ఆదివారం రోజున రాష్ట్రంలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక, మోకా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరిగినట్టుగా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుపాన్ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి ఏపీ వైపు వీచే గాలులు తగ్గాయని.. దీంతో గాలిలో తేమ శాతం తగ్గిపోయిందని వారు తెలిపారు. తేమలేని పొడిగాలులు వీస్తుండటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు.