
అమరావతి: వైసిపి ప్రభుత్వ పాలనవల్ల నష్టపోతున్న రైతులపక్షాన పోరాడేందుకు ప్రతిపక్ష టిడిపి సిద్దమయ్యింది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, తాజాాగా ఆసనీ తుఫానుతో పాటు వివిధ కారణాలతో నష్టపోయే అన్నదాతలకు న్యాయం చేసేలా ప్రభుత్వంతో పోరాడేందుకు 'రైతు కోసం తెలుగుదేశం' పేరిట ఓ కమిటీ ఏర్పాటు చేసారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పాటుచేసినట్లు ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
అన్నదాతలకు అండగా నిలబడేందుకు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతులకు న్యాయం జరిగేలా చూడటం కోసమే ఈ కమిటీని ఏర్పాటుచేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఓ వైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. మరోవైపు వరుస ప్రకృతి విపత్తులతో అన్నదాతలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. ఇలా సమస్యలన్నీ చుట్టుముట్టడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని... రోజూ ఇద్దరు, ముగ్గరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేసారు.
దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం నిలవడం వ్యవసాయరంగం పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్యానికి నిదర్శనమని అచ్చెన్న అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి అండగా నిలబడేందుకు... వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా పోరాడేందుకు టీడీపీ ఆధ్వర్యంలో 'రైతు కోసం తెలుగుదేశం' కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రైతు కోసం తెలుగుదేశం కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, కూన రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని సభ్యులుగా నియమించినట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఇక ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసనీ తుఫాన్ బలహీనపడింది. రేపు ఉదయానికి ఇది వాయుగుండంగా మారనుంది. ఏపీలో చీరాల, బాపట్ల వద్ద తుపాను తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాకినాడకు 180 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. గంటకు 12 కి.మీ వేగంతో తుఫాన్ పశ్చిమ బంగాళాఖాతం వైపునకు దూసుకుపోతోంది. మచిలీపట్టణం, నర్సీపట్నం, యానాం, కాకినాడ, విశాఖ మీదుగా తుఫాన్ పయనిస్తుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
అసాని తుఫాన్ ప్రబావంతో ఏపీలోని కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, యానాం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో తీవ్ర అలజడి నెలకొంది. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు 3 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి.
కోస్తాంధ్ర తీరం వెంట గంటకు 75 నుండి 90 కి. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్ఎప్, మరో 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేశారు.