మన మాతృబాషకే తెగులు పట్టించే ఓ తెలుగు మాస్టారు వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మాస్టారు మాకొద్దు బాబోయ్ అంటూ విద్యార్థులు ఏకంగా కలెక్టర్ ను ఆశ్రయించారు... ఆ తెలుగు మాస్టారు తెలివి ఎలా వుందంటే...
గుంటూరు : 'దేశ బాషలందు తెలుగు లెస్స' అంటూ రాజు శ్రీకృష్ణదేవరాయలు గొప్పగా పొగిడిన బాష మనది. తెలుగు బాష తీయదనం గురించి పరాయి బాషల వారు గొప్పగా చెబుతుంటే... తెలుగోళ్లకు మాత్రం మాతృబాషలోని మాధుర్యం తెలియడంలేదు. ఇంగ్లీష్ మోజులో మాతృబాషను మనమే చంపేసుకుంటున్నాం. ఇప్పటికే రాబోయే తరాలు తెలుగు అంటే పరాయి బాషగా భావించే పరిస్థితి నెలకొంది. తెలుగువాళ్ళందరి గురించి పక్కనబెడదాం... చివరకు తెలుగు బోధించే ఉపాధ్యాయుల పరిస్థితి కూడా ఇలాగే తయారయ్యింది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఓ తెలుగు టీచర్ తెలివి బయటపడింది.
గుంటూరు జిల్లా పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాలలో నాగేశ్వరరావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇలా విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉన్నతస్థానంలో వున్నాడు. అలాంటిది అతడికే సరైన జ్ఞానం లేదు... విద్యార్థులకు తెలిసినంత కూడా అతడికి తెలియదు. ఇతడు తమ పిల్లలకు విద్యాబుద్దులు ఏం నేర్పుతాడని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగేశ్వరరావు... తెలుగు టీచర్. కానీ అతడికి తెలుగు బాషపై ఏమాత్రం పట్టు లేదనేది విద్యార్థుల వాదన. అతడికి తెలుగు అక్షరాలే సరిగ్గా రాయడం రాదని విద్యార్థులు చెబుతున్నారు. మాతృబాషకు తెగులు పట్టిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న తెలుగు టీచర్ నాగేశ్వరరావుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. అతడిని వెంటనే పాఠశాల నుండి తప్పించాలని విద్యాశాఖ అధికారులను వేడుకుంటున్నారు.
అయితే తెలుగు టీచర్ ను గురించి హెడ్ మాస్టర్ తో పాటు మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో విద్యార్థులు ఏకంగా కలెక్టర్ వద్దకు వెళ్ళారు. గుంటూరు కలెక్టరేట్ కు చేరుకున్న పెదరావూరు విద్యార్థులు టీచర్ ను బదిలీ చేయాలంటూ కలెక్టర్ ను కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇదే డిమాండ్ చేసారు. దీంతో పూర్తి వివరాలు తెలుసుకుని సదరు టీచర్ పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెళ్లిపోయారు.
ఈ తెలుగు టీచర్ తెలివి గురించి విద్యార్థుల మాటల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలుగు అక్షరాలు కూడా తెలుగు టీచర్ కు రావు... య,ర, ల తర్వాత ఱ రాసాడంటూ విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఇంగ్లీష్ మోజులో తెలుగు అంతరించిపోయే పరిస్థితి నెలకొంది... ఇలాంటి టీచర్ల వల్ల అది పూర్తిగా చచ్చిపోయేలా వుందంటూ తెలుగోళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అర్హత లేని వ్యక్తులకు ఇలా టీచర్ ఉద్యోగాలిచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని కోరుతున్నారు.