
బాపట్ల : మద్య తరగతి కుటుంబంలో పుట్టిన అతడు చదువులో చురుకు.దీంతో కొడుకు జీవితం బావుంటే చాలని భావించిన ఆ తల్లిదండ్రులు తలకుమించిన భారమే అయినా విదేశాలకు పంపించి ఉన్నతవిద్య అందిస్తున్నారు. ఇలా కొడుకు బంగారు భవిష్యత్ పై గంపెడాశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోత మిగిలింది. ఉన్నత చదువుల కోసమని విదేశాలక వెళ్ళిన కొడుకు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో విషాదం నింపింది.
బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని మారుమూల గ్రామం జొన్నతాళికి చెందిన సింగయ్య-సుబ్బాయమ్మ దంపతుల కుమారుడు గోవాడ నాగసాయి గోపి అరుణ్ కుమార్(23) బాగా చదివేవాడు. మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తిచేసిన కొడుకు కోరిక మేరకు ఆస్తులను తాకట్టుపెట్టి మరీ అమెరికాకు పంపించారు తల్లిదండ్రులు. ఇలా ఎంఎస్ చదివేందుకు అరుణ్ ఏడు నెలల కింద అమెరికాకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి యూఎస్ లో వుంటున్న అతడు ఈ నెల ఆరంభం నుండి కనిపించకుండాపోయి చివరకు శవమై తేలాడు.
Read More న్యూయార్క్ లో విమాన ప్రమాదం.. భారత సంతతికి చెందిన మహిళ మృతి, కూతురు పరిస్థితి విషమం...
అరుణ్ కనిపించడం లేదంటూ అతడి స్నేహితులు మార్చి 1న అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలోనే మార్చి 4న అరుణ్ నివాసముండే ప్రాంతానికి సమీపంలోని ఓ సరస్సులో భారత యువకుడి మృతదేహాన్ని అమెరికా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు స్థానిక భారతీయులకు సమాచారమిచ్చారు. దీంతో అరుణ్ స్నేహితులు కూడా అనుమానంతో వెళ్లిచూసి ఆ మృతదేహం తమవాడిదేనని గుర్తించారు. స్నేహితుల సహకారంతో అరుణ్ మృతదేహం ఇండియాకు చేరింది.
అయితే మొదట అరుణ్ ప్రమాదవశాత్తు మృతిచెందాడని... ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దేశం కాని దేశంలో చేతికందివచ్చిన కొడుకు చనిపోగా ఏం జరిగిందో తెలుసుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు వున్నారు. తమకు కొడుకు మృతికి కారణమేంటో తెలుసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలోనూ ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరివల్లా కావడంలేదు.