
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో రెడ్ల పాత్రపై చర్చ మొదలైంది. ఎందుకంటే, దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రంలో రెడ్లీ కీలకపాత్ర పోషించారన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది మొదటిసారిగా రాష్ట్ర విభజన నేపధ్యంలో వారి ఆధిపత్యానికి గండిపడింది. అయితే తెలంగాణాలో కానీ ఏపిలో తీసుకున్నా పలుచోట్ల రెడ్డి అభ్యర్ధలే గెలిచారు. దాంతో ఇప్పటికీ రెడ్డి సామాజికవర్గం రాజకీయంగా బలమైన స్ధితిలోనే ఉంది.
రాష్ట్ర విభజన జరిగి తెలంగాణాలో కెసిఆర్, ఏపిలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రెడ్ల అస్తిత్వ పోరాటం మొదలైంది. ఆ పోరాటాన్నే తెలంగాణాలో రేవంత్ రెడ్డి, ఏపిలో జగన్ కొనసాగిస్తున్నారు. దానికితోడు కెసిఆర్, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు కూడా రెడ్లను దెబ్బకొట్టేదిగా ఉండటంతో రెడ్ల పునరేకీకరణ మొదలైనట్లే కనబడుతోంది.
తెలంగాణాలో అయినా ఏపిలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం చాలా బలమైనది. రాజకీయ అధిపత్యం మొత్తం రెడ్ల దశాబ్దాల పాటు రెడ్ల చేతిలోనే ఉంది. మొన్నటి ఎన్నికలు ప్రత్యేక పరిస్ధితిల్లో జరిగింది కాబట్టి సామాజికవర్గాలకు అతీతంగా జనాలు కెసిఆర్, చంద్రబాబుకు పట్టంగట్టారు.
అయితే, వారి విధానాలను తట్టుకోలేకపోయిన రెడ్లు వ్యతిరేకించటం మొదలుపెట్టారు. అందుకే ఏపిలో జగన్, తెలంగాణాలో రేవంత్ పాలకపక్షాలపై పెద్ద పోరాటమే మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లోని మెజారిటీ రెడ్డి నేతలు వీరిద్దరికీ మద్దతుగా నిలబడ్డారు. తాజాగా తెలంగాణాలో రేవంత్ రూపంలో మొదలైంది అదే. రేవంత్ కూడా (వెలమ + కమ్మ) వెల్ కమ్ గ్రూపంటూ పదే పదే చెప్పటంలో మర్మమిదే. టిడిపి నుండి రేవంత్ గనుక బయటకు వచ్చేసి కాంగ్రెస్ లో చేరితే మెజారిటీ రెడ్లు రేవంత్ కు మద్దతు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
సరే, ఇక ఏపిలో పరిస్ధితి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, వైసీపీకి రెడ్డి సామాజిక మద్దతును దూరం చేయటానికి చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నం లేదు. అందుకనే, ప్రధానంగా వైసీపీలోని రెడ్డి ఎంఎల్ఏలే లక్ష్యంగా పావులు కదుపుతున్న విషయం అందరూ చూస్తున్నదే.
రెడ్ల మద్దతు లేనిదే రాయలసీమ, కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించటం కష్టమన్న విషయం చంద్రబాబుకు అర్ధమైపోయింది. అందుకనే రెడ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే, పోయిన ఎన్నికల్లో లాగే రెడ్డి సామాజికవర్గం మద్దతు వచ్చే ఎన్నికల్లో కూడా తనకే ఉంటుందని జగన్ భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో రెడ్లే కీలకపాత్ర పోషించేట్లు కనబడుతోంది.