పథకం ప్రకారం దళితులను నాశనం చేశాడు .. మరోసారి గెలిస్తే : జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 20, 2024, 7:25 PM IST
Highlights

వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే రాష్ట్రం అంధకారమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దళితులను పథకం ప్రకారం నాశనం చేసిన జగన్.. ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులను ఉద్ధరిస్తానంటే ఎవరైనా నమ్ముతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే రాష్ట్రం అంధకారమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శనివారం కోనసీమ అంబేద్కర్ జిల్లా మండపేటలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని, రాయితీపై విద్యుత్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనరు, గిట్టుబాటు ధర ఇవ్వరని ఆయన దుయ్యబట్టారు. 

మంచినీరు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే ప్రాంతం కోనసీమ అని.. పంటలకు సాగునీరు అందించిన బ్రిటీష్ ఇంజనీర్ కాటన్ దొరను ఇప్పటికీ పూజిస్తారని చంద్రబాబు గుర్తుచేశారు. అందరికీ అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ ఇక్కడి వారేనని, కాలువలు బాగు చేయకుండా పంటలను ముంచేశారని , పోలవరం పూర్తి చేసి వుంటే జిల్లాకు సాగునీరు అందేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగం దేశంలోనే అగ్రస్థానంలో వుండేదని, జగన్ అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. 

Latest Videos

దళితులకు తానేదో చేశానని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని , కానీ దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీయేనన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమీషన్ వేశామని.. దీనిపై నివేదిక వచ్చిన అనంతరం 12 జీవోలు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. బీఆర్ అంబేద్కర్‌కు భారతరత్నం వచ్చింది ఎన్టీఆర్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వున్నప్పుడేనని ఆయన తెలిపారు. కోనసీమ ప్రాంతానికి చెందిన జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్ స్పీకర్‌గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌గా చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతిగా ప్రతిపాదించింది టీడీపీయేనని తెలిపారు. 

జగన్ దళిత వ్యతిరేకి అని.. తాము దళితుల కోసం తీసుకొచ్చిన 27 పథకాలను రద్దు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. దళితుల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ.28 వేల కోట్లను దారి మళ్లించాడని ఫైర్ అయ్యారు. జగన్ ముందు ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదని .. ఎవరైనా నోరు విప్పితే వారిపై దాడులు జరిగాయన్నారు. ఈ జిల్లాకే చెందిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. దళితులను పథకం ప్రకారం నాశనం చేసిన జగన్.. ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులను ఉద్ధరిస్తానంటే ఎవరైనా నమ్ముతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. 
 

click me!