
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నిర్ణయం తీసుకుంది.గత సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై(Chandrababu Naidu) వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు భార్యను అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ గత అసెంబ్లీ సమావేశాలను మధ్యలోనే బహిష్కరించిన సంగతి తెలిసిందే. తన భార్యను అవమానించేలా మాట్లాడరని చెప్పిన చంద్రబాబు.. మీడియాతో మాట్లాడుతూ కన్నీరు కూడా పెట్టుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు.
అయితే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార వైసీపీ తప్పుడు విధానాలను ఎండట్టేందుకు అసెంబ్లీకి వెళ్లాలని కొందరు టీడీపీ నేతలు ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా అన్న అంశంపై టీడీపీ హైకమాండ్ విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును తిరిగి ప్రవేశపెట్టే అవకాశాలు , కొత్త జిల్లాల ఏర్పాటు బిల్లు.. వంటి వాటిపై టీడీపీ పొలిట్‌బ్యూరో చర్చించింది. ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు బడ్జెట్ సమావేశానికి టీడీపీ సభ్యులు హాజరు కావాలని పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి జగన్‌కు హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని వారు పేర్కొన్నారు.
పోలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలు తన భార్యపై అనుచితంగా మాట్లాడినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీని కురు సభగా ఆయన పేర్కొన్నారు. ఇక, చంద్రబాబు లేకుండా సభకు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకావడంపై కూడా చర్చించారు.. అయితే అది సరికాదనే నిర్ణయానికి వచ్చారు.
టీడీపీ నుంచి గెలుపొందిన నలుగురు ఎమ్మెల్యేలు, వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, మద్దాళి గిరిధర్, వాసుపల్లి గణేష్‌లు.. పార్టీ నుంచి వైదొలిగారు. దీంతో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే 19 మంది ఎమ్మెల్యేలలో విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీ సమావేశాలకు హాజరుకావడం లేదు. చంద్రబాబు సభకు హాజరుకావడం లేదని ప్రకటించిన నేపథ్యంలో.. ఓ రకంగా టీడీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి హాజరు కావాల్సి ఉంటుంది.
ఆ 17 మందిలో అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రాద్, బుచ్చయ్య చౌదరి మాత్రమే అసెంబ్లీ సమావేశాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మిగిలిన వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని టీడీపీ నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక, తన తల్లిదండ్రులకు జరిగిన అవమానానికి వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు బేషరతుగా క్షమాపణలు చెబితేనే తాము అసెంబ్లీకి హాజరవుతామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే.. బడ్జెట్ సెషన్‌ను టీడీపీ దూరంగా ఉంటుందని ఆయన చెప్పారు.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న టీడీపీ అధిష్టానం.. రాబోయే రెండేళ్లు ప్రజల మద్దతు పొందేందుకు ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచన చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి తీసుకొచ్చేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ఇక, నేడు జరిగే టీడీఎల్పీ భేటీలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై తుది నిర్ణయం తీసుకున్న అనంతరం.. అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.