
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు సంబంధించి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన వస్తోందని అన్నారు. ఏపీలో బీఆర్ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామును తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాలేదని అన్నారు.
2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. తెలంగాణలో 8 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ది పనులను చూసి.. ఏపీలోని ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
Also Read: బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ !!
ఇక, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఈరోజు ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తదితరులు బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు సంబంధించి కేసీఆర్ కీలక కామెంట్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.