తెలంగాణకు చెందిన యువకుడు, ఆంధ్ర ప్రదేశ్ కు చేందిన ట్రాన్స్ జెండర్ ను ప్రేమించడమే కాదు పెళ్ళాడేందుకు సిద్దమయ్యారు. హైదరాబాద్ లో చిగరించిన ఈ ప్రేమ వ్యవహారం నందిగామలో బయటపడింది.
విజయవాడ : కులమతాలు అడ్డువచ్చినా పెద్దలతో పోరాడి పెళ్లాడిన ప్రేమజంటను తరచూ చూస్తుంటాం. ప్రాంతాలు, బాషలు చివరకు దేశాలు వేరయినా ప్రేమలో పడి పెళ్ళాడిన జంటలను చూసాం. కానీ లింగ బేదం కూడా ప్రేమికులను విడదీయలేదని ఈ జంట నిరూపించారు. ట్రాన్స్ జెండర్ ను ప్రేమించిన ఓ యువకుడు పెద్దలను ఎదరించి మరీ ప్రియురాలిని పెళ్ళాడేందుకు సిద్దమైన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... తెలంగాణ ప్రాంతానికి చెందిన గణేష్, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపు ప్రేమించుకున్నారు. హైదరాబాద్ లో వుంటున్న వీరిమధ్య పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది. దీపు ట్రాన్స్ జెండర్ అని తెలిసే గణేష్ ప్రేమించాడు. తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లాలని గణేష్- దీపు జంట నిర్ణయించుకుని పెద్దలకు తెలిపారు..
ట్రాన్స్ జెండర్ ను ప్రేమిస్తున్న విషయం గణేష్ కుటుంబసభ్యులకు తెలిపాడు. పెళ్ళికి వారు అంగీకరించకపోవడంతో ప్రియురాలితో కలిసి ఆమె స్వస్థలమైన ఎన్టీఆర్ జిల్లా నందిగామకు వెళ్లాడు. అక్కడే పెళ్ళి చేసుకునేందుకు వీరు సిద్దమవగా గణేష్ కుటుంబసభ్యులు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వీడియో
తమకు అందిన ఫిర్యాదుమేరకు నందిగామ పోలీసులు గణేష్, దీపు లను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టమని... కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని వారు పోలీసులకు తెలిపారు. అందరు ప్రేమికుల్లాగే తాముకూడా పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు వారిని పంపించారు.
పోలీస్ స్టేషన్ వద్ద గణేష్, దీపు జంట మాట్లాడుతూ... తమ ప్రేమ, పెళ్లి ఈ సమాజానికి కనువిప్పు కలిగించేవేనని అన్నారు. ప్రేమకు కులమతాలు, చిన్నాపెద్ద తేడాలే కాదు లింగ బేధాలు కూడా వుండవని... అందుకు తమప్రేమే ఉదాహరణగా పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్ తో జీవితాన్ని పంచుకోవాలని అనుకోవడం తప్పేమీ కాదని గణేష్ అన్నారు. సమాజం తమ ప్రేమను గుర్తించి సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పంచాలని గణేష్-దీపు జంట కోరారు.