ఏపీలో టీచర్ల డిజిటల్ అటెండెన్స్‌పై వివాదం.. సాంకేతిక సమస్యలతో చిక్కులు.. టీచర్లు ఏమంటున్నారంటే..

By Sumanth KanukulaFirst Published Aug 17, 2022, 3:14 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల డిజిటల్ అటెండెన్స్‌పై వివాదం నెలకొంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసేందుకు ఏపీ విద్యాశాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అయితే అటెండెన్స్ యాప్‌లో సాంకేతిక సమస్యలు కొన్ని ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల డిజిటల్ అటెండెన్స్‌పై వివాదం నెలకొంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసేందుకు ఏపీ విద్యాశాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి ఉపాధ్యాయుడు లొకేషన్‌ను ఎనేబుల్ చేస్తూ పాఠశాలలో ఉదయం 9 గంటలలోపు హాజరు నమోదు చేసుకోవాలి. ఉపాధ్యాయులు యాప్‌ని ఉపయోగించి తరగతి గదిలో సెల్ఫీని క్లిక్ చేసి సర్వర్‌కు అప్‌లోడ్ చేయాలి. హాజరు నమోదు చేయడంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా సగం రోజు గైర్హాజరైనట్లు పరిగణిస్తారు.

అయితే ఈ నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రేషనలైజేషన్ చర్యల్లో భాగంగా తమను వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశారని.. ఇప్పటికీ పాత పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు దరఖాస్తులో చూపుతున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆరోపించారు. అలాంటప్పుడు యాప్‌లో ఎలా నమోదు చేస్తామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై.. పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

మరోవైపు  అటెండెన్స్ యాప్‌లో సాంకేతిక సమస్యలు కొన్ని ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తోంది. యాప్‌లో హాజరు వేసేందుకు తిప్పలు పడుతున్నారు. సొంత ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. ఉదయం 9 గంటలకు ముందు లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా.. ఎర్రర్ వస్తుందని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పదే పదే లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించిన లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు. తాము ఈ విధానానికి వ్యతిరేకం కాదని.. టెక్నికల్ సమస్యలు పరిష్కారించాలని కోరుతున్నారు. అలాగే తమ ఫోన్లలో కాకుండా.. ఇందుకోసం ప్రభుత్వం ఒక డివైజ్ పెట్టాలని కోరారు. అలాగే లాగిన్ అయ్యేందుక ఐదు, పది నిమిషాల వెసులుబాటుతో అదనపు ఇవ్వాలని కోరుతున్నారు. 

ఇక, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసేందుకు ప్రభుత్వమే మొబైల్స్, ట్యాబ్‌లు కావాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ట్యాబ్‌లు పంపిణీ చేసే వరకు యాప్ ఆధారిత హాజరును వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం.. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని ఉపాధ్యాయులను కోరుతున్నాయి.
 

click me!