అప్పటికల్లా టీడీపీ కనుమరుగవుతుంది.. చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

By Mahesh RajamoniFirst Published Nov 18, 2022, 5:03 AM IST
Highlights

Amaravati: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే కర్నూలు రోడ్‌షో నిర్వహించారని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు గుప్పించారు.
 

Minister Seediri Appala Raju: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ ఉనికి లేకుండా పోతుందని హెచ్చరించారు. గురువారం నాడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు నారా లోకేశ్ పై ఆశలు కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల సానుభూతిని చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారనీ, రోడ్ షోల్లో భార్య పేరును కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

అలాగే, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు కర్నూలు రోడ్ షో నిర్వహించారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో తన పార్టీకి ఓటేయాలని చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ, ఇది తనకు చివరి ఎన్నికలు కాబట్టి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ భవితవ్యాన్ని ఒక్కసారిగా ముద్ర వేస్తాయని మంత్రి అన్నారు. అప్పటికీ టీడీపీ కనుమరుగు అవుతుందన్నారు. తాను అధికారంలోకి వస్తే 'కౌరవ సభ'ను 'గౌరవ సభ'గా మారుస్తానని టీడీపీ అధినేత చేసిన ప్రకటనను మంత్రి ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు నవ్వులు పూయించారని అన్నారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిరాశలో ఉన్నారనీ, తన స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అప్పల రాజు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ సీబీఐకి సహకరిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈడీ, ఇతర సంస్థల నుంచి దర్యాప్తు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ సానుభూతిని పొందడానికి ఎన్నడూ ప్రయత్నించలేదన్నారు. అయితే, చంద్రబాబు నాయుడు నిరాశా నిస్పృహల నుంచి సానుభూతిని వెలికితీసి, రాజకీయ లబ్ధి కోసమే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

కర్నూలును న్యాయ రాజధానిగా మార్చడాన్ని టీడీపీ అధినేత వ్యతిరేకిస్తున్నారనీ, కేవలం తన అనుచరులు, మద్దతుదారుల ప్రయోజనాలను కాపాడేందుకే వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం సానుభూతి డ్రామాలు ఆడుతూ చంద్రబాబు అసంబద్ధమైన ప్రకటనలు చేస్తూ వైకాపా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకునే విజయాలు లేనందున అసంబద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని మంత్రి అప్పల రాజు అన్నారు.

డీడబ్ల్యూసీఆర్ఏ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోడీ తనను ప్రశంసించారని టీడీపీ అధినేత చెప్పడాన్ని తప్పుబట్టిన మంత్రి.. ఈ పథకాన్ని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశ పెట్టగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ దానిని పునరుద్ధరించి, మెరుగుపరిచారని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తర ఆంధ్ర, రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడును నమ్మే స్థితిలో లేరనీ, విజయవాడ, గుంటూరు ప్రజల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. 29 గ్రామాల్లో తన మనుషుల కోసం శాసనసభ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేయలేదన్నారు.

click me!