
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాలు.. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వెంకటరమణపల్లిలో శుక్రవారం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయమై వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
ఇక, ఈ ఘటనలో గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం హిందూపురంకు తరలించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయమై వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత చౌడు రెడ్డి.. ఇతర ప్రాంతాల నుంచి రెండు కార్లలో కొంతమందిని గ్రామానికి పిలిపించి టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేయించారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.