మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా... ఆందోళనలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు

By Arun Kumar P  |  First Published Jan 6, 2021, 12:04 PM IST

ఇటీవలే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనాతో బాధపడుతూమృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా ప్రతిపక్ష టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనాతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ప్రతిపక్ష టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోమిరెడ్డి స్వయంగా ప్రకటించారు. 

''అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు'' అంటూ సోమిరెడ్డి ట్వీట్ చేశారు.

Latest Videos

అయితే నిన్న(మంగళవారం)విజయవాడలోని సోమిరెడ్డి నివాసంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు పార్టీకి చెందిన సీనియర్లు పాల్గొన్నారు. అలాగే రెండు రోజుల క్రితం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు సోమిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఇవాళ సోమిరెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఈ సమావేశాలకు హాజరయిన వారిలో ఆందోళన మొదలయ్యింది.  

ఇటీవల కాలంలో సోమిరెడ్డి పాల్గొన్న కార్యక్రమాలకు హాజరైన నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. వీరందరూ కరోనా పరీక్ష చేయించుకోడానికి సిద్దమయ్యారు. ఇక సోమిరెడ్డి అనుచరులు, టిడిపి కార్యకర్తలు ఆయన కరోనా నుండి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

click me!