మోటార్లకు మీటర్లు పెట్టడం తెలిసిన ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు కాపాడడం తెలీదా?.. చంద్రబాబు నాయుడు

By SumaBala BukkaFirst Published Oct 29, 2022, 2:05 PM IST
Highlights

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కరెంట్ షాక్ తో ఒకేరోజు ఐదుగురు మరణించారని.. అది చాలా విషాదకరమైన విషయం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 

వైఎస్సార్ జిల్లా : కడప జిల్లా, చాపాడు మండలం, చియ్యపాడులో సాగు మోటారుకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తెగిపడి కాలికి తగలడంతో ముగ్గురు రైతులు మరణించారు. రాష్ట్రంలో మిగతా చోట్ల విద్యుత్ ప్రమాదాలలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక్కరోజే 5 గురిని బలితీసుకోవడం అత్యంత విషాదకరం అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో విద్యుత్ ప్రమాదాల కారణంగా 675 మంది చనిపోయారు. 143 మంది గాయపడ్డారు. 681 పశువులు చనిపోయాయి. ఇవి స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పిన లెక్కలు. దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఇది సిగ్గుచేటు.   

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం తెలుసు. ఆ మీటర్ల పేరిట వేల కోట్ల స్కామ్ చేయడం తెలుసు. కరెంటు రేట్లు పదేపదే పెంచడం తెలుసు. కానీ ప్రజల ప్రాణాలు తీస్తున్న విద్యుత్ ప్రమాదాలను నివారించడం, అందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం తెలీదా ఈ ప్రభుత్వానికి? అని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. 

నిన్ను చూస్తేనే బుగ్గ గిల్లాలని అనిపిస్తుంది.. కొంచెం చూసుకోవమ్మా రసగుల్లా: టీడీపీ నేత పట్టాభిపై ఆర్జీవీ ఫైర్

కాగా, వైఎస్ఆర్ జిల్లాలో పొలాల్లోని విద్యుత్ తీగలు నలుగురు అన్నదాతలను బలి తీసుకున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఓ పాఠశాలలో నిర్లక్ష్యంగా వదిలేసిన విద్యుత్ తీగ కారణంగా ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. 

వివరాలు ఏంటంటే.. వైఎస్ జిల్లా చాపాడు మండలం చియ్యపాడుకు చెందిన పెద్దిరెడ్డి ఓబులరెడ్డి (66), బాల ఓబులరెడ్డి (57) అన్నాదమ్ములు. వీరు భూమిని కౌలుకు తీసుకుని వదిసాగు చేపట్టారు. పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు మరో రైతు బొమ్ము మల్లికార్జున్ రెడ్డి (25)ని తీసుకెళ్లారు. పురుగులమందు కలుపుతుండగా పొలంలో పడి ఉన్న విద్యుత్ తీగను ఒకరు తొక్కారు. వెంటనే షాక్ తలిగి పడిపోయారు.

ఆయనను కాపాడబోయి ఒకరి తరువాత మరొకరు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన రెండు గంటల తరువాత అటుగా వెడుతున్న రైతులు గమనించి చెప్పేవరకూ విషయం ఎవరికీ తెలియదు. బాల ఓబులరెడ్డి భార్య సావిత్రమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాయక్ తెలిపారు. ఇదే జిల్లా సింహాద్రిపురం మండలం బి. చెర్లోపల్లికి చెందిన రైతు భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (39) ధనియాలు సాగు చేశారు. పొలానికి నీటి తడులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా మోటారుకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫ్యూజులు సరిచేస్తుండగా షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 

click me!