
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) తీరని అన్యాయం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు (ashok babu) ఆరోపించారు. తమకు జరిగిన మోసానికి తగిన సమయంలో ఉద్యోగులు రివేంజ్ తీర్చుకుంటారని... సీఎం జగన్ కు ఉద్యోగుల నుండి రిటర్న్ గిప్ట్ ఖాయమని అశోక్ బాబు హెచ్చరించారు.
''న్యాయబద్దమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు చేపట్టిన ఉద్యమం వెనుక టీడీపీ (telugudesham party) హస్తముందంటూ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగనే మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఉద్యోగుల న్యాయబద్ద పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది'' అని అశోక్ బాబ్ పేర్కొన్నారు.
''సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యోగ సంఘాల నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేసి ఉద్యమాన్ని నీరుగార్చారు. నాయకులు తమ స్వార్దం కోసం ఉద్యోగస్తుల్ని మోసం చేయబట్టే పీఆర్సీ సాధన కోసం ఏర్పడిన జేఏసీ నుంచి ఉద్యోగులంతా బయటకొచ్చి కొత్త జేఏసీలతో ఉద్యమానికి సిద్దమవుతున్నారు'' అని అన్నారు.
''ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చమంటే సాకులు చెప్పి తప్పించుకుంటారా... అయినా రాష్ట్ర ఆర్దిక పరిస్థితి బాగాలేదనటం పచ్చి అబద్దం. 2021 డిసెంబర్ నాటికే రాష్ట్రానికి రూ. 97 వేల కోట్ల ఆదాయం వచ్చింది, మార్చి నాటికి దాదాపు లక్షా 32 వేల కోట్ల రూపాయలకు పెరుగుతుంది. ఇలా కోవిడ్ సమయంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందే తప్ప తగ్గలేదు'' అని అశోక్ బాబు వెల్లడించారు.
''వైసిపి (ysrcp) ప్రభుత్వం నాడు-నేడు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు, ఇళ్ల స్థలాల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఈ అవినీతే లేకపోతే రాష్ట్రం కోసం పనిచేస్తున్న ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ ఇవ్వొచ్చు'' అని అశోక్ బాబు పేర్కోన్నారు.
ఇక ఇప్పటికే ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ (PRC Sadhana Samithi Steering Committee) ఏకపక్షంగా వ్యవహరించిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ సంఘాల తరపున పీఆర్సీ సాధన సమితిలో కొనసాగుతున్న నాయకులు స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జేఏసీ ఛైర్మన్లకు రాజీనామాలు పంపుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు.
''పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నాం. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసన కార్యక్రమాలు చేపడతాం. రౌండ్ టేబుల్ భేటీలో కార్యాచరణపై చర్చిస్తాం. మాతో కలిసి వచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పెద్దఎత్తున ఉద్యమిస్తాం. ఉపాధ్యాయుల మనోభావాలు గౌరవించాలి'' అని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి.
ఏపీ హైకోర్టు ఉద్యోగులు కూడా పీఆర్సి సాధన సమితి స్టీరింగ్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఉద్యోగుల సమస్యలపై పూర్తి పరిష్కారం చూపకుండానే ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమాన్ని నీరుగార్చారంటూ హైకోర్టు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసింది
''ఉద్యోగుల ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగ సంఘాల నాయకులు విఫలం అయ్యారు. కాబట్టి ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై పునరాలోచించి ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై దృష్టి పెట్టండి. గత పీఆర్సీలోని లోటుపాట్లను గుర్తించి మరింత మెరుగైన పీఆర్సీ ప్రకటించాలి'' అని హైకోర్టు ఉద్యోగుల సంఘం తరపున సీఎం జగన్ కు రాసిన లేఖలో అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు.