చంద్రబాబుకు ఎంఎల్ఏల షాక్

First Published Nov 14, 2017, 3:56 PM IST
Highlights
  • అసెంబ్లీలో సొంత ఎంఎల్ఏలే చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారు.
  • వివిధ సమస్యలపై ఎంఎల్ఏల్లో ఆగ్రహాన్ని చూసి చంద్రబాబు, మంత్రులకు షాక్ కొట్టినట్లైందట

         అసెంబ్లీలో సొంత ఎంఎల్ఏలే చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారు.

        వివిధ సమస్యలపై ఎంఎల్ఏల్లో ఆగ్రహాన్ని చూసి చంద్రబాబు, మంత్రులకు షాక్ కొట్టినట్లైందట

 

‘వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన నేపధ్యంలో  అధికార పక్షమే ప్రతిపక్షం పాత్రను పోషించాలి’...ఇవి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మూడు రోజుల క్రితం చెప్పిన మాటలు. తమ అధినేత చెప్పిన మాటలను, ఇచ్చిన స్వేచ్చను ఎంఎల్ఏలు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను లేవనెత్తుతూ మంత్రులను ఓ ఆట ఆడుకుంటున్నారు. టిడిపి సభ్యులకు తోడు మిత్రపక్షమైన భాజపా నేత విష్ణుకుమార్ రాజు కూడా రెచ్చిపోతున్నారు. దాంతో స్వపక్షం ఎంఎల్ఏలకన్నా వైసీపీ సభలో ఉంటేనే బాగుంటుందని పలువురు మంత్రులు అనుకుంటున్నారట.

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన ఇసుక అక్రమ రవాణా, ఆహార పదార్ధాల కల్తీ, పాల ఉత్పత్తుల్లో కల్తీ, నిత్యావసరాల కల్తీపై సభ్యులు వేస్తున్న ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. దాంతో ఇదే అవకాశంగా పలువురు ఎంఎల్ఏలు మంత్రులపై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడుతూ, రోజుకు ఎన్నికోట్ల రూపాయలు విలువైన ఇసుక అక్రమ రవాణా  జరుగుతోందో సభ్యులు ఉదాహరణలతో సహా చెబుతుండటంతో ఫిరాయింపు మంత్రి రంగారావు బిత్తరపోతున్నారు.

ఇసుక అక్రమ రవాణాపై మంత్రి సమాధానం సంతృప్తిగా లేదంటూ బుచ్చయ్య చౌదరి, విష్ణుకుమార్ రాజు, బి. రమణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు మండిపడ్డారు. అక్రమ రవాణా జరుగుతున్న విధానం, ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముడుతోంది ? ఏ ఏ జిల్లాలో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయన్న విషయాలను సభ్యులు వివరించారు. ఇవే విషయాలను ఒకపుడు వైసీపీ ప్రస్తావిస్తే మాత్రం అవన్నీ ఆరోపణలే అంటూ అధికారపార్టీ ఎదురుదాడి చేసేది.

ఇక, ఆహారకల్తీ గురించి మాట్లాడుతూ, తినే వస్తువుల నుండి ఔషధాల వరకూ ప్రతీది కల్తీయేనంటూ సభ్యులు మండిపడ్డారు. కలమట వెంకటరమణ మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో దాదాపు అన్ని వస్తువులూ కల్తీయేనన్నారు. రాష్ట్రంలో కల్తీ కాని వస్తువే లేదంటూ బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పాలలో కూడా యూరియా కల్తీ చేస్తున్నారంటూ మాజీ మంత్రి మృణాళిని ఆరోపించారు. నిత్యావసరాల గురించి మాట్లాడుతూ, డెల్టా ప్రాంతంలో రైతులు పండిస్తున్న మినుములకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని సభ్యులు నరేంద్రకుమార్, రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేసారు.

click me!