
అమరావతి: ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు తమకు స్పీకర్ తమ్మినేని సీతారాం (tammineni sitharam) అవకాశమే ఇవ్వడంలేదని టిడిపి ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. గత ఐదారు రోజులుగా తాము నాటు సారా, అక్రమ మద్యం, జె బ్రాండ్ మద్యం అమ్మకాలు... వాటివల్ల చోటుచేసుకుంటున్న మరణాలపై చర్చింద్దామంటే స్పీకర్ అవకాశం ఇవ్వడంలేదన్నారు. ఇలా అధికారపార్టీకి భజనచేస్తున్న స్పీకర్ వైఖరిని నిరసిస్తూ సభను అటెన్షన్ లోని తేవడానికే తాము విజిల్ వేశామని టిడిపి ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
సభలో ఈల వేసినందుకు సస్పెండ్ అయిన టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (eluru sambashivarao) మాట్లాడుతూ... బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉన్నవ్యక్తి నిస్పక్షపాతంగా అధికార, ప్రతిపక్షాలను సమాన అవకాశాలు కల్పించాలన్నారు. కానీ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని అధికారపార్టీ ఆదేశాలు, ముఖ్యమంత్రి కనుసైగల ప్రకారం నడుచుకుంటున్నారని ఆరోపించారు.
''గత 15రోజులనుంచీ సభ జరుగుతున్నా ఒక్కరోజు కూడా ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా ఈ స్పీకర్ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. సభ నుంచి సస్పెండైన వారిని బయటకు పంపడానికి ఉన్న మార్షల్స్ తో సభను నడిపించారు. 50 నుంచి 60మంది మార్షల్స్ తో సభను నడిపించడం ఎంతటి దుర్మార్గమో స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరూ ఆలోచించుకుంటే మంచిది'' అన్నారు.
''వైసిపి ప్రభుత్వం కావాలనే సభలో మైండ్ గేమ్ ఆడుతోంది. రెండుసార్లుగా ఆరుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఎందుకంటే సమాధానం చెప్పరు. సభలో ఈలవేస్తే అది తప్పా. మరి సభలో నానారభస చేస్తూ, అయినదానికి కానిదానికీ బల్లలుచరిచేవారిని ఏం చేయాలి? వారిపై ఎలాంటి చర్యలు ఉండవెందుకు?'' అని సాంబశివరావు స్పీకర్ ను ప్రశ్నించారు.
''ప్రభుత్వం యొక్క దుర్మార్గపు, ఉన్మాదపు చర్యలను ఎండగట్టడానికి తామెప్పుడు వెనుకాడమని తేల్చిచెబుతున్నాం. మద్యం, నాటుసారా వల్ల చనిపోయినవారి మరణాలపై చర్చించడానికి ప్రభుత్వం ఒక్కసారైనా అవకాశమిస్తుందని భావించాము. కానీ అదేమీ చేయకపోగా మమ్మల్ని అవమానిస్తూ..హేళనగా మాట్లాడుతూ, వెకిలినవ్వులు నవ్వుతున్నారు'' అన్నారు.
''జంగారెడ్డిగూడెంలో యధేచ్ఛగా సాగుతున్న సారా పరిశ్రమపై అక్కడ చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. ముఖ్యమంత్రేమో నిండుసభలో అక్కడ పోలీసులు ఉన్నారు.. అంతమంది జనాభా ఉన్నారు... అక్కడెలా సారాకాస్తారు.. ఎలా అమ్ముతారంటూ అమాయకంగా ప్రశ్నించాడు. అమాయకంగా ముఖంపెట్టి ముఖ్యమంత్రి ఏరోజైతే సభను తప్పుదారి పట్టించారో ఆరోజు నుంచి ఆయన నాటుసారా మరణాలపై సభలో చర్చే జరక్కూడదని భీష్మించు కూర్చున్నాడు'' అని టిడిపి ఎమ్మెల్యే పేర్కొన్నారు.
''తెలుగుదేశం సభ్యులు సభలో ఉంటే ముఖ్యమంత్రి అసలు సభకే రాకుండా తప్పించుకున్నాడు. మద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ నేడు అదే మద్యాన్ని ఏరులైపారిస్తూ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లల్ని అడిగితే వారే చెబుతారు.. ఈముఖ్యమంత్రి జేబ్రాండ్స్ వ్యవహారం... నాటుసారా వ్యాపారం గురించి. నాటుసారాతో పాటు, కల్తీమద్యం అమ్మకాలతో ఈ ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.10వేలకోట్లవరకు ప్రజలసొమ్ముని కొల్లగొట్టాడు'' అని సంచలన ఆరోపణలు చేసారు.
''ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టం. ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టేవరకు తమ పోరాటం ఆగదు. ముఖ్యమంత్రి తన తాడేపల్లి ప్యాలెస్ ను డబ్బుతో నింపుకోవాలన్న యావతో, అవినీతి వ్యామోహంతో ప్రజల ప్రాణాలను తనకల్తీ మద్యానికి, నాటుసారా విక్రయాలకు బలిచేస్తున్నాడు. డబ్బుపిచ్చితో అమాయకులైన ప్రజలప్రాణాలు తీస్తూ, వేలకోట్లు దిగమింగుతున్న ఈ ముఖ్యమంత్రికి తమ వారిని పోగోట్టుకొని రోడ్లపాలైనవారి ఉసురు తప్పకుండా తగులుతుందని హెచ్చరిస్తున్నాం'' అన్నారు.
''వైసీపీసభ్యులు అసెంబ్లీలో భజనచేస్తున్నారు..దానికంటే తాము విజిల్ చేయడమే కరెక్ట్. 10 రోజులనుంచీ తమకు అవకాశమివ్వాలని ప్రాధేయపడుతున్నా పట్టించుకోని స్పీకర్ ...వైసీపీ వారి భజనకు, డూడూ బసవన్నలా తల ఊపుతున్నాడు. అసలు ఈ స్పీకర్ నడుపుతున్నది సభేనా...లేక జగన్మోహన్ రెడ్డి సన్మాన సభా.? వెకిలిచేష్టలు, వెటకారపు ధ్వనులు చేస్తున్నది వైసీపీ సభ్యులే..తాము ఎప్పుడూవారిలా ప్రవర్తించలేదు. తమకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరే క్రమంలోనే తాము విజిల్ వేశాము. సభను అటెన్షన్ లోకి తీసుకొచ్చి, ప్రజలకు అసలు సభలో ఏం జరుగుతోందో చెప్పడానికే తాము విజిల్ వేశాము'' అని ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు.