కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే వంశీ భేటీ లోగుట్టు ఇదే.....

By Nagaraju penumalaFirst Published Jul 9, 2019, 2:32 PM IST
Highlights

స్వర్ణభారతి ట్రస్ట్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారధ్యంలో నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమాలకు తాను ఎప్పుడూ హాజరవుతూనే ఉంటానన్నారు. బీజేపీ టీడీపీల మధ్య పొత్తు ఉన్న సమయంలోనూ పొత్తు లేని సమయంలో కూడా పాల్గొన్నానని తెలిపారు. 
 


అమరావతి: తెలుగుదేశం పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నానని త్వరలోనే బీజేపీలోనే చేరుతున్నట్లు వస్తున్న వార్తలను వంశీ ఖండించారు. 

తాను ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి విధేయడుగానే పనిచేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆయన సూచనల మేరకు పనిచేస్తానన్నారు. అంతేకానీ పార్టీమారే ఆలోచన తనకు లేదన్నారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గన్నవరం నియోజకవర్గం రావడంతో తాను మర్యాదపూర్వకంగా కలిశానని అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డితో భేటీ అయ్యానని తెలిపారు. 

స్వర్ణభారతి ట్రస్ట్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారధ్యంలో నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమాలకు తాను ఎప్పుడూ హాజరవుతూనే ఉంటానన్నారు. బీజేపీ టీడీపీల మధ్య పొత్తు ఉన్న సమయంలోనూ పొత్తు లేని సమయంలో కూడా పాల్గొన్నానని తెలిపారు. 

రాజకీయాలకు అతీతంగా స్వర్ణభారతి ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగస్వామ్యం అయ్యేందుకు ఆ ట్రస్ట్  కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. అప్పుడు రాని ప్రచారం ఇప్పుడు ఎందుకు వస్తుందో తనకు తెలియడం లేదన్నారు. 

తాను ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి విధేయుడుగానే ఉంటానని పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు నమ్మెద్దని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సూచించారు.  
 

click me!