నాకు గన్‌మెన్‌గా వచ్చిన వ్యక్తి.. మళ్లీ కనిపించలేదు: సెక్యూరిటీ ఉపసంహరణపై పయ్యావుల వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 12, 2022, 05:13 PM IST
నాకు గన్‌మెన్‌గా వచ్చిన వ్యక్తి.. మళ్లీ కనిపించలేదు: సెక్యూరిటీ ఉపసంహరణపై పయ్యావుల వ్యాఖ్యలు

సారాంశం

తనకు ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్ మళ్లీ కనిపించలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. తనకు ప్రస్తుతం ఎలాంటి భద్రతా లేదని, ఏం జరుగుతుందో చూద్దామంటూ కేశవ్ వ్యాఖ్యానించారు  

టీడీపీ (tdp) సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (payyavula keshav) భద్రత తగ్గింపు వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. తన భద్రతను తొలగించారని కేశవ్ ఆరోపిస్తుంటే.. అలాంటిదేమి లేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో పయ్యావుల కేశవ్ మీడియా ముందుకు వచ్చారు. తనకు వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించిన వ్యక్తి మళ్లీ కనిపించలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు నివాసానికి ఈరోజు ఉదయం వెళ్లిన కేశవ్ వెంట గన్ మెన్ కనిపించలేదు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకు ప్రస్తుతం ఎలాంటి భద్రతా లేదని, ఏం జరుగుతుందో చూద్దామంటూ కేశవ్ వ్యాఖ్యానించారు. 

కాగా.. ప్రస్తుతం పయ్యావుల కేశవ్ కు 1+1 భద్రత ఉంది. అయితే తాజాగా దానిని ప్రభుత్వం సోమవారం ఉపసహరించింది. ఈ నిర్ణయం పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సెక్యూరిటీ విత్ డ్రా‌ చేయడం ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల పెగాసస్‌ వ్యవహారంపై పయ్యావుల మాట్లాడుతూ.. ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయనకు భద్రతను ఉపసంహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ALso Read:టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌‌కు సెక్యూరిటీ తొలగింపు.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు..

టీడీపీ హయాంలో పెగాసస్ వినియోగించారని అధికార వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ ఎక్విప్‌మెంట్ కొన్నారని అనవసపు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసెస్ ఎక్విప్‌మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్‌టీఏ ద్వారా సమాధానం ఇచ్చారని పయ్యావుల గుర్తుచేశారు. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేశవ్ దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు డేటా చౌర్యం చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారని పయ్యావుల ఆరోపించారు.

పెగాసెస్ పై పెద్ద సభా కమిటిని వేసి చర్చ నిర్వహించడం వృధాప్రయాసే అయ్యిందని.. పెగాసెస్ మీద చర్చ జరగాలని శాసనసభలో వేస్ట్ గా షార్ట్ డిస్కసన్ కూడా పెట్టారని ఆయన మండిపడ్డారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ అభద్రతకు నిదర్శనమని కేశవ్ ధ్వజమెత్తారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఇచ్చిన ల్యాప్ ట్యాప్ లు ఏ ఎమ్మెల్యే వాడటం లేదన్నారు.  సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా టీడీపీ నాయకులపై నిరర్థకంగా కొనసాగిస్తున్నారని కేశవ్ దుయ్యబట్టారు. రాజకీయ నేతలు, సొంత పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా నిఘా పెట్టడం నిజంకాదా అని పయ్యావుల ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్ కు సిద్ధమా అని కేశవ్ సవాల్ విసిరారు. 
 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu