
ఈసారి అసెంబ్లీ సమావేశాలు విచిత్రంగా జరగబోతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికార పక్షమే ప్రతిపక్షం పాత్ర కూడా పోషించబోతోంది. అంటే 10వ తేదీన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో టిడిపినే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పాత్రను పోషించనున్నది. ఎందుకంటే, చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపు రాజకీయాలకు నిరసనగా వైసీపీ అసెంబ్లీ సీమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించటమే అందుకు కారణం. ఈ విషయమై చంద్రబాబు మంగళవారం రాత్రి తనకు అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో సమావేశమై చర్చించారు.
ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిచాంలని నిర్ణయించటం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. దాంతో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలను నిర్ణయించటమెలా అన్న విషయమై పెద్ద చర్చే జరిగింది. అప్పుడే సింగపూర్ ఫార్ములా తెరపైకి వచ్చింది. అదేంటంటే, సింగపూర్ లో ప్రతిపక్షం లేనపుడు అధికారపక్ష సభ్యులే ప్రతిపక్షం పాత్రను పోషిస్తారు. ఇక్కడ కూడా అదే పద్దతిని పాటిస్తే సరిపోతుందని చంద్రబాబు చేసిన సూచనకు అందరూ ఆమోదించారు.
అందులో భాగంగానే మంత్రులకు వేయాల్సిన ప్రశ్నలను తయారు చేయాలని ఉన్నతాధికారులను సిఎం ఆదేశించారు. అంటే రేపటి సమావేశాల్లో అధికారపక్షమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్న మాట. ప్రతిపక్షముండి కూడా అధికారపక్షమే విపక్షం పాత్ర పోషించటమంటే నిజానికి ప్రభుత్వానికే అవమానం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి రప్పించేందుకు చర్యలేమైనా తీసుకునే వారేమో. కానీ ఇక్కడున్నది చంద్రబాబు కాబట్టే తనపై వస్తున్న ఆరోపణలను, విమర్శలను దులిపేసుకున్నారు. పైగా వైసీపీపై ఎదురుదాడులు చేయమని ప్రోత్సహిస్తూ నిసిగ్గుగా తన చర్యలను సమర్ధించుకుంటున్నారు.