
పల్నాడు : పల్నాడు జిల్లా టిడిపి రొంపిచర్ల మండలాధ్యక్షుడు మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి (70)గత 20 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. 20 రోజుల క్రితం తుపాకీ కాల్పులలో తీవ్రంగా గాయపడ్డారు ఆయన. అప్పటినుంచి గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి రమేష్ ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఈ నెల 1వ తేదీన ఆయన మీద దాడి జరిగింది. బాలకోటిరెడ్డి స్వగ్రామమైన ఆలవాలలో ఆయన ఇంట్లోనే ఆయన మీద కాల్పులు జరిగాయి. అదే గ్రామానికి చెందిన పమ్మి వెంకటేశ్వర రెడ్డి, నుదురుపాడు కు చెందిన వైసీపీ క్రియాశీలక కార్యకర్త వంటిపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ జగన్, పుజాల రాములు, పులి అంజిరెడ్డిలు ఆయన మీద దాడి చేశారు.
బాలకోటి రోడ్డు మీద రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో తుపాకీ కాల్పులకు గురై బాలకోటిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పిటల్లో హుటాహుటిన చేర్చారు. అయితే తుపాకీ కాల్పులతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన కోలుకోలేకపోయారు. పరిస్థితి విషమించింది. దీంతో ఈనెల 17వ తేదీన ఆ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి మార్చారు. అక్కడ అతనికి ఇంకా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మంగళవారం రాత్రి అక్కడ చికిత్స పొందుతూనే కన్నుమూశారు.
పల్నాడులో టీడీపీ మండలాధ్యక్షుడి మీద కత్తులు, గొడ్డళ్లతో దాడి..
బాలకోటిరెడ్డి మృతి మీద టిడిపి నరసరావుపేట నియోజకవర్గ బాధ్యుడు డాక్టర్ చదలవాడ అరవిందబాబు వైసీపీ మీద మండిపడ్డారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యనని అన్నారు. నిరుడు జులైలో కూడా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దీనిని పేర్కొంటూ చదలవాడ అరవింద బాబు ‘మొదటి సారి దాడి చేసినప్పుడే పోలీసులు వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు ఇలా బాలకోటిరెడ్డికి జరిగేది కాదు. ఆయనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. బాలకోటిరెడ్డికి రక్షణ కల్పించలేదు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి పల్నాడు జిల్లాలో తుపాకీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు’.. అంటూ మండిపడ్డారు.
ఇక, బాలకోటిరెడ్డి మృతి పట్ల టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల టిడిపి మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై వైసిపి గుండాలే కాల్పులు జరిపారు. ఇది దారుణం అని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ హత్య జరిగిందని ఆరోపణ చేశారు. కోటిరెడ్డి మీద గతంలో కూడా దాడికి పాల్పడ్డారు, ఆ సమయంలో దాడికి పాల్పడిన వెంకటేశ్వర్ రెడ్డి అనే వైసీపీ నేతకు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆశ్రయం కల్పించాడు. ఎమ్మెల్యే ఇలా చేయడం ద్వారా హంతకులకు సహకరిస్తున్నారని తెలిసిపోతుంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే ప్రభుత్వం అరెస్టు చేయాలి.. అని అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అంతేకాదు వైసిపి గుండాల దాడిలో మృతిచెందిన వెన్నా బాలకోటి రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.