Mahanadu 2025 : ఆపరేషన్ సిందూర్ స్పూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ .. ఆర్థిక ఉగ్రవాదులపై యుద్దం : చంద్రబాబు నాయుడు

Published : May 29, 2025, 08:21 PM ISTUpdated : May 29, 2025, 08:33 PM IST
Nara Chandrababu Naidu

సారాంశం

దేశానికి ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో రాజకీయ ముసుగులో దాగివుండే ఆర్థిక ఉగ్రవాదులు కూడా సమాజానికి అంతే ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. అందుకోసమే ఆపరేషన్ సిందూర్ స్పూర్తితో ఏపీలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేపడామని చంద్రబాబు అన్నారు. 

TDP Mahanadu 2025 : తెలుగుదేశం పార్టీ రాయలసీమలో నిర్వహించిన మహానాడు గురువారం భారీ బహిరంగసభతో ముగిసింది. కడపలో టిడిపి నాయకులు, కార్యకర్తల సమక్షంలో మూడురోజుల పాటు మహానాడు జరిగింది... చివరిరోజైన ఇవాళ దాదాపు ఐదులక్షల మందితో బహిరంగ సభ నిర్వహించారు. 140 ఎకరాల్లో ఈ సభకు ఏర్పాట్లు చేయగా ఆ ప్రాంతమంతా టిడిపి జెండాలు, బ్యానర్లు, కటౌట్లతో పసుపుమయం అయ్యింది.

ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేశపూరితంగా ప్రసంగించారు. పాకిస్థాన్ కు భారత్ ఎలాగైతే ఆపరేషన్ సిందూర్ ద్వారా బుద్దిచెప్పిందో అదే స్పూర్తితో ఏపీలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేపడతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గతంలో విధ్వంస పాలన చూసాం ... కానీ కూటమి అధికారంలోకి వచ్చాక పాజిటివ్, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్‌కు నాంది పలికామన్నారు. క్లీన్ పాలిటిక్స్ చేయాలని టిడిపి శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

దేశానికి ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో రాజకీయ ముసుగులో దాగివుండే ఆర్థిక ఉగ్రవాదులు కూడా సమాజానికి చాలా ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను ఎలాగైతే ఏరిపారేసారో అలాగే ఈ ఆర్థిక ఉగ్రవాదులను రాష్ట్రం నుండి తరిమికొడదామని అన్నారు. ఇందుకోసం ఆపరేషన్ సిందూర్ స్పూర్తితో 'ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్' చేపడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

గత వైసిపి హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థిక ఉగ్రవాదులు రెచ్చిపోయారని చంద్రబాబు ఆరోపించారు. ల్యాండ్, సాండ్, వైన్, మైన్... ఇలా ప్రతిదాంట్లో స్కాం చేసారని... రాష్ట్ర ప్రజలు సొమ్ము, ప్రకృతి ప్రసాధించే సహజవనరులను దోచుకున్నారని ఆరోపించారు. నమ్మి ఓటేసిన ప్రజలకు జే బ్రాండ్ కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ అంటగట్టి ఆరోగ్యాన్ని పాడు చేసారని... వీరి ఆగడాలకు ఎందరో బలైపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.

చివరకు అడవులను ధ్వంసం చేసి లగ్జరీ ఎస్టేట్ లు కట్టుకున్నారని... కొండలు, చెరువులు వేటినీ వదలకుండా మింగేసారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జాచేసి ప్రజలసొమ్ముతోనే ప్యాలస్ లు, ఎస్టేట్ లు కట్టుకుని అక్రమ సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నారని ఆరోపించారు. ఇలా ప్రజా సేవకుల్లా కాకుండా నియంతల్లా వ్యవహరిస్తూ అహంకారంతో విర్రవీగిన వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధిచెప్పారని చంద్రబాబు అన్నారు.

రాజకీయ పార్టీ ఎలా ఉండాలో... ప్రభుత్వ పాలన ఎలా ఉండాలో చెప్పడంలో టీడీపీ ప్రస్థానం ఒక ఒక కేస్ స్టడీగా చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే క్రమంలో పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో వైసీపీ ఒక కేస్ స్టడీగా పేర్కొన్నారు. ఇప్పటికే వైసిపిని కోలుకోలేని దెబ్బ తీసామని... ఇకపై అడ్రస్ లేకుండా చేస్తామన్న చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల త్యాగం, పోరాటాల ఫలితంగానే ఈ ప్రజాపాలన వచ్చిందన్నారు.

మహానాడు సూపర్ హిట్...

కూటమి ప్రభుత్వ హయాంలో ఆ దేవుని గడప కడపలో మహానాడు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు. మూడురోజుల పాటు ఎంతో అద్బుతంగా కార్యక్రమాలు జరిగాయని... కడపలో మొదటిసారి నిర్వహించిన మహానాడు సూపర్ హిట్ అయ్యిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కడప రాజకీయాలు మారతాయని చెప్పానని... తాను చెప్పినట్లుగా జరిగిందని చంద్రబాబు గుర్తుచేసారు.

 

 

రాష్ట్రవ్యాప్తంగానే కాదు కడపలో కూడా టిడిపి, జనసేన, బిజెపి (కూటమి) అద్భుత ప్రదర్శన కనబర్చిందని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కడపలో మొత్తం 10 ఎమ్మెల్యేస్థానాలుంటే కూటమికి 7 సీట్లు వచ్చాయని.. ఇది మామూలు విషయం కాదన్నారు. ఇంకాకొంచెం ఫోకస్ పెడితే 10 కి 10 సీట్లు వచ్చేవి... 2029 ఎన్నికల్లో ఇది సాధించడానికి సిద్దమవుతున్నామన్నారు. మీరు సిద్దమా తమ్ముళ్లు, ఆడబిడ్డలు? అని చంద్రబాబు అడిగారు. సభకు వచ్చినవారి నుండి అవుననే సమాధానం వినిపించింది.

ఒక్క కడపలోనే కాదు వైసిపి బలంగా ఉందని చెప్పుకునే రాయలసీమలో టిడిపి అత్యధిక సీట్లు సాధించిందన్నారు. ఈ సీమలో మొత్తం 52 సీట్లుంటే కూటమికి 45 స్థానాలు వచ్చాయన్నారు... ఇందులో టిడిపివే 40 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే రాయలసీమలో బలవంతులమని చెప్పుకునే వైసిపి ఇక్కడ 7 సీట్లకే పరిమితం అయ్యింది... టిడిపి కేవలం కడప జిల్లాలోనే 7 సీట్లు సాధించిందని చంద్రబాబు అన్నారు.

కూటమికి ప్రజలు అసాధారణ విజయంతో ఆశీర్వదించారని... 93 శాతం స్ట్రయిక్ రేట్, 57 శాతం ఓట్ షేర్, అదిరిపోయే మెజారిటీలు ఇచ్చారన్నారు. ఒకప్పుడు అసెంబ్లీకి 10 వేలు,15 వేలు మెజారిటీలు వస్తే మంచి మెజారిటీలు అనుకునేవాళ్లం... కానీ మొన్నటి ఎన్నికల్లో 83 మందికి 30 వేలపైన, 30 మందికి 50 వేలపైన, 10 మందికి 70 వేలపైన, ముగ్గురికి 90 వేలపైన మెజారిటీలు వచ్చాయన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, భీమిలిలో గంటా శ్రీనివాస రావు, మంగళగిరిలో నారా లోకేష్‌కి 90 వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు. వైనాట్లు, గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కాదంటూ వైసిపిని ఎద్దేవా చేసారు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం తమ విధానం....ఏడాదిగా అదే చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu