కోటంరెడ్డితో టీడీపీ నేతల భేటీ.. నెల్లూరులో వేగంగా మారుతున్న రాజకీయం..

By Sumanth KanukulaFirst Published Jun 10, 2023, 1:00 PM IST
Highlights

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతలు సమావేశమయ్యారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రలు.. నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి వెళ్లి  ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలోకి చేరాలని ఆయనకు సోమిరెడ్డి, బీద రవిచంద్రలు ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది.

మరికొద్ది రోజుల్లోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఆలోపే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ  సాగుతుంది. 


కోటంరెడ్డితో భేటీపై స్పందించిన అమర్‌నాథ్ రెడ్డి.. ‘‘మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌తో కలిసి నెల్లూరు మాగుంట లేఔట్‍లో  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కలిసి జిల్లాలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగ జిల్లాలో పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించడం జరిగింది’’ అని ట్వీట్ చేశారు. 

Also Read: బాబుతో భేటీ.. టీడీపీలో ఆనం చేరికకు రంగం సిద్దం.. నెల్లూరులో కీలక పరిణామాలు..!!

ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో కూడా జిల్లా టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఇక, ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం రోజు హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డి  టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా  కనిపిస్తోంది. 
 

click me!