
ఆంధ్రప్రదేశ్‌లో దివీస్ కంపెనీకి సంబంధించిన రగడ కొనసాగుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ... కోనసీమ ప్రజల డిమాండ్ల పరిష్కారానికి దివీస్ సంస్థ అంగీకరించిందంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
స్థానికులపై పెట్టిన క్రిమినల్ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని యనమల డిమాండ్ చేశారు. కేసులు తొలగిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేయలేదని, సంస్థను మరో ప్రాంతానికి తరలించడానికి కూడా అంగీకరించలేదని రామకృష్ణుడు చెప్పారు.
పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో రొయ్యల వ్యాపారం దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమంగా దీని వల్ల యువత ఉపాధి కోల్పోతారని యనమల ఆందోళన వ్యక్తం చేశారు.
పరిశ్రమ ఏర్పాటు వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించాల్సింది ప్రభుత్వమే తప్ప దివీస్ కాదని రామకృష్ణుడు స్పష్టం చేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని కొత్తపాకల వద్ద దివీస్ ఫార్మా పరిశ్రమను ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.