బాకీ తీర్చడానికి మళ్లీ అప్పులు, జగన్ సీఎంగా వుంటే.. ఏపీ మరో నైజీరియానే : యనమల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 6, 2022, 3:28 PM IST
Highlights

జగన్ సీఎంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మరో నైజీరియాగా మారుతుందన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. జగన్ ప్రభుత్వ అప్పులు, ఆదాయానికి సంబంధం వుండటం లేదని... అప్పుల కారణంగానే ఏడాదికి రూ.50 వేల కోట్లకు పైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోందని యనమల అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని.. వ్యవసాయం, వృత్తులు, వ్యాపారాలు అన్నింటినీ సంక్షోభంలోకి నెట్టేశారని యనమల పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కులవృత్తులు అస్తవ్యస్తంగా తయారైందని.. ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ అంధకారం కావడం తథ్యమని రామకృష్ణుడు హెచ్చరించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నైజీరియా, జింబాబ్వేల మాదిరిగా తయారవుతుందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగ్ నివేదికపైనా యనమల స్పందించారు. అప్పుల్ని బడ్జెట్‌లో చూపించకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని.. మూడున్నరేళ్లలో రూ.8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని ప్రజల ఆదాయం పెరగలేదని రామకృష్ణుడు పేర్కొన్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తోన్న పన్ను ఆదాయం ఎక్కడికి పోతోందో అన్నది కూడా బహిర్గతం చేయడం లేదని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అప్పులు, ఆదాయానికి సంబంధం వుండటం లేదని... అప్పుల కారణంగానే ఏడాదికి రూ.50 వేల కోట్లకు పైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోందని యనమల అన్నారు. ఇవి భవిష్యత్తులో రూ. లక్ష కోట్లకు చేరే ప్రమాదం వుందని.. ఆదాయం మొత్తం వడ్డీలకే వెళ్లిపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని రామకృష్ణుడు ప్రశ్నించారు. 

Also REad:దర్శనానికి వచ్చి రాజకీయాలా... దుర్గగుడికి చంద్రబాబు చేసిందేమీ లేదు : మంత్రి కొట్టు సత్యనారాయణ

2021 మార్చి నాటికి జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు జీఎస్డీపీలో 44.04 శాతానికి చేరుకున్నాయని.. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయడాన్ని బట్టి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగోలేదని చెప్పడమేనని యనమల పేర్కొన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ఏపీ తలసరి అప్పు రూ.67 వేలకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటి సంస్థల విషయంలో జగన్ మాట తప్పి రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని యనమల ఎద్దేవా చేశారు. ఆదాయాన్ని పెంచుకోవడం, సంపద సృష్టించుకోవడం ద్వారానే భవిష్యత్తుకు భరోసా అనే సిద్ధాంతాన్ని కూడా పట్టించుకోలేదని రామకృష్ణుడు దుయ్యబట్టారు. జగన్ విధానాలు రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

click me!