ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరం: జగన్ సర్కార్ పై యనమల ఫైర్

By narsimha lodeFirst Published Aug 19, 2020, 1:40 PM IST
Highlights

 ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే డిజిపి, హోంమంత్రి భుజాలు తడుముకోవడం ఏమిటని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలిలో విపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

అమరావతి: ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే డిజిపి, హోంమంత్రి భుజాలు తడుముకోవడం ఏమిటని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలిలో విపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

బుధవారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలో అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో జరిగిందేమిటో చూశాం. హైకోర్టులు, సుప్రీంకోర్టు దీనిపై స్పష్టమైన మార్గదర్శకం చేశాయని  ఆయన గుర్తు చేశారు. 

ప్రజా భద్రతా ప్రయోజనాలు, అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమైతే  దేశ సార్వభౌమాధికారానికి దేశ సమగ్రతకు భంగం వాటిల్లిన సందర్భాల్లో మాత్రమే దీనికి ఆమోదం ఉంటుందన్నారు. పియూసిఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు  పేర్కొందన్నారు.

ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం దీనిపై ఇంటర్ సెప్షన్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వుంటుంది. ఆర్డర్స్ ఇచ్చేముందు  అందులో పైన పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖల కార్యదర్శులు చూడాలన్నారు. ఆ తర్వాతే సదరు ఆర్డర్ కాపీలను సర్వీస్ ప్రొవైడర్లకు అందజేయాలని స్పష్టంగా నిర్దేశించిందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ లలో అలాంటి హేతుబద్ద కారణాలేమీ లేవు. హైకోర్టులు పేర్కొన్న మార్గదర్శకాలు గాని సుప్రీంకోర్టు నిర్దేశించిన  అంశాలుగాని ఇక్కడ వర్తించేవి కావని ఆయన తెలిపారు.

 అటువంటప్పుడు ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ లన్నీ రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తాయన్నారు. కేంద్ర చట్టాల ఉల్లంఘనలే. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘనలేనని ఆయన చెప్పారు.

అత్యున్నత స్థాయిలో వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ లు చేయడం ‘‘రూల్ ఆఫ్ లా’’ కు  వ్యతిరేకమని ఆయన గుర్తు చేశారు.నిజంగా ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితులే వస్తే లిస్ట్ ఆఫ్ టెలిఫోన్ల జాబితా సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వాలి డేటా కలెక్షన్ చేపట్టాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ఆయన  కోరారు.

ఈ విషయమై ప్రధాని నరేంద్రమోదికి మాజీ సిఎం చంద్రబాబు లేఖ రాస్తే, దానికి డిజిపి స్పందించడం నిజంగా భుజాలు తడుముకోవడంలాగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దళిత యువకుడు వర ప్రసాద్ శిరోముండనం కేసులో రాష్ట్రపతి ఏవిధంగా స్పందించారో అదేవిధంగా ప్రధాని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పై స్పందిస్తారు. అప్పటిదాకా ఆగకుండా డిజిపి వెంటనే భుజాలు తడుముకుంటున్నారన్నారు.  కొన్నిగంటల్లోనే మాజీ సీఎంకు లేఖ రాయడంహోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం విచిత్రంగా ఉందన్నారు.

రాజకీయ పార్టీలను అణిచేయడానికి, ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, జ్యుడిసియరీని బ్లాక్ మెయిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే బరితెగించారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్య విరుద్దం రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆయన చెప్పారు.

ఏపిలో ఫోన్ ట్యాపింగ్ గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. దానిపై తన బాధ్యతగా మాజీ సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.  తర్వాత పరిణామాలపై ఎదురు చూడకుండా రాష్ట్ర హోం మంత్రి, డిజిపి స్పందించడాన్నిబట్టి అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కన్నా తీవ్ర నేరం మరొకటి లేదు. వివిధ అంశాలపై న్యాయస్థానాల్లో న్యాయవాదులు వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాదులు వాదనలను జడ్జిలు వినేటప్పుడు, అడ్వకేట్ల ఫోన్లను జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయడం అనేది చాలా తీవ్రమైన అంశంగా ఆయన పేర్కొన్నారు.

ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు అందజేశారా..? ఇచ్చివుంటే సదరు ఫోన్ నెంబర్ల లిస్ట్ బైట పెట్టాలి. వాళ్లిచ్చిన సమాచారం వెంటనే  కేంద్రానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ చేసేది రాష్ట్రప్రభుత్వంలో వాళ్లే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి. ముద్దాయే సాక్ష్యాధారాలు తనకివ్వాలని అడగడం ఎక్కడైనా ఉందా..? ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా..?  ఆని ఆయన ప్రశ్నించారు.

ట్యాపింగ్ పై కేసు పెట్టాలని డిజిపి సలహా ఇవ్వడం మరో విడ్డూరం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా ఉన్నప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి..? 
అందుకే కేంద్రానికి ఫిర్యాదు పంపినట్టుగా ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో చట్టాలను అతిక్రమించి, న్యాయవ్యవస్థను అతిక్రమించి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఈ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు.
 

click me!