ఆ పోలీస్ అధికారులపై యాక్షన్ తీసుకోండి: హెచ్చార్సీకి వర్ల రామయ్య లేఖ

By Arun Kumar PFirst Published Sep 3, 2021, 11:22 AM IST
Highlights

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమకేసులు పెడుతున్నారని... అలాంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్చార్సీకి లేఖ రాశారు వర్ల రామయ్య.  

విజయవాడ: పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన చేసిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. నిరసన తెలిపిన టిడిపి నాయకులను పోలీసులు కేసులు పెట్టి ఎలా వేదిస్తున్నారో వివరిస్తూ హెచ్చార్సీకి లేఖ రాశారు రామయ్య. 

''ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ (టిడిపి) 28 ఆగష్టు 2021న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.108... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యధిక ధరను కలిగి ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కోవిడ్ నిబంధనలను అనుసరించి నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేపట్టడం జరిగింది'' అని తెలిపారు. 

read more  సీఎం జగన్ ఉన్మాదం... వీరికంటే తాలిబన్లే నయం: చంద్రబాబు సీరియస్ (వీడియో)

''అయితే అధికార వైసీపీ పోలీసు బలగాలను మొహరించి టిడిపి నాయకులను, కార్యకర్తలను, సాధారణ ప్రజలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేశారు. కొంతమందిని గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రజలు తమ అసమ్మతిని శాంతియుతంగా వ్యక్తం చేయకుండా బెదిరించేందుకు అనేకమందిపై కేసులు నమోదు చేయబడ్డాయి. చాలా చోట్ల వివిధ సెక్షన్ల కింద తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా చట్టవిరుద్ధంగా అరెస్టులు చేసి అక్రమంగా నిర్బంధించారు. రాజ్యాంగాన్ని పాటించకుండా, ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘింస్తూ పోలీసులు ప్రదర్శనకారులను చట్టవిరుద్ధంగా నిర్బంధించారు'' అని పేర్కొన్నారు.  

''ఏ విధమైన కోవిడ్ నిభందనలు పాటించని అధికార వైసిపి నాయకులు నిర్వహించే జన సమ్మేళనాలు, ఊరేగింపులు, సమావేశాలపై పొలీసులు తీవ్రంగా నిర్లక్ష్యం చేసారు. వైఎస్ఆర్‌సిపి నేతృత్వంలోని ప్రభుత్వం టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని వారిని బాధితులుగా చేసేందుకు కోవిడ్ మహమ్మారిని సాకుగా ఉపయోగిస్తోంది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) విచారణ జరిపి కేసులను నమోదు చేయడానికి బాధ్యులైన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్‌హెచ్‌ఆర్‌సి సత్వరం చర్య తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులను పునరుద్ధరించి ఆర్టికల్ 19 ను కాపాడాలని కోరుతున్నాను'' అని తన లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య. 

click me!