
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సునీల్ కుమార్ అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సునీల్ అక్రమార్జనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వర్ల రామయ్య కోరారు. బినామీల పేరుతో సునీల్ ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భూములు కొనుగోలు చేశారని పోలీస్ సిబ్బందే చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఇకపోతే.. సునీల్ కుమార్ హిందుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు వర్ల రామయ్య మరోసారి సునీల్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అంతకుముందు శనివారం గన్నవరంలో దాడికి గురైన టీడీపీ కార్యాలయాన్ని వర్ల రామయ్య పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుందని ఎస్పీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులకు ముందే తెలుసునని ఆరోపించారు. పోస్టింగ్ ఇవ్వరన్న భయంతోనే జిల్లా ఎస్పీ అన్ని విషయాలు గోప్యంగా వుంచుతున్నారని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని ఆయన తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు , అవినీతితోనే వైసీపీ పాలన సాగుతోందని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
Also Read: గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ప్రభుత్వం పనే.. ఎస్పీకి ముందే తెలుసు : వర్ల రామయ్య వ్యాఖ్యలు
అంతకుముందు సోమవారం వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్రణాళిక ప్రకారమే గన్నవరంలోని తమ కార్యాలయంపై దాడులు జరిగాయని ఆరోపించారు. కొంతమంది పోలీసుల వల్లే సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తనను పర్యటించొద్దు అనడానికి పోలీసులు ఎవరు.. బెదిరిస్తే పారిపోతామా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ను నమ్ముకున్న ఎందరో అధికారులు జైలుకు వెళ్లారని.. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. దొంగలాటలు వద్దు.. లగ్నం పెట్టుకుందాం, తాడోపేడో తేల్చుకుందామని, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా జగన్ రావాలని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.