ఐటీ అధికారులతో ముగిసిన వర్ల రామయ్య భేటీ.. గుడివాడ క్యాసినో రూ. 500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపణ..

By Sumanth KanukulaFirst Published Dec 19, 2022, 4:01 PM IST
Highlights

గుడివాడ క్యాసినో ఎపిసోడ్‌కు సంబంధించి ఐటీ అధికారులతో టీడీపీ నేత వర్ల రామయ్య సమావేశమయ్యారు. 

గుడివాడ క్యాసినో ఎపిసోడ్‌కు సంబంధించి ఐటీ అధికారులతో టీడీపీ నేత వర్ల రామయ్య సమావేశమయ్యారు. గుడివాడ క్యాసినో వ్యవహారంపై దృష్టి సారించిన ఐటీ అధికారులు.. సమాచారం ఇవ్వాలని వర్ల రామయ్యకు నోటీసులు ఇచ్చిన సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే వర్ల రామయ్య నేడు విజయవాడలోని ఐటీ కార్యాలయంలో ఈడీ అధికారులకు తన వద్ద ఉన్న సమాచారం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వర రావు, బోండా ఉమ, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు కూడా విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వచ్చారు. 

ఐటీ అధికారులతో భేటీ అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నామని ప్రచారం చేశారని తెలిపారు. చీకోటి ప్రవీణ్ ప్రచారం చేసిన ఆధారాలను ఐటీ అధికారులకు ఇచ్చామని చెప్పారు. ప్రవీణ్ తనకు స్నేహితుడేనని వల్లభనేని వంశీ స్వయంగా చెప్పారని అన్నారు. గోవా నుంచి వచ్చిన మహిళలకు సంబంధించి విమాన టిక్కెట్ల వివరాలు ఐటీకి ఇచ్చామని తెలిపారు. కొడాలి నాని, వల్లభనేని  వంశీ, చీకోటి ప్రవీణ్ అంతా ఓ తాను ముక్కలేనని విమర్శించారు. గుడివాడ క్యాసినోలో రూ. 500 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. 

ఇక, ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఫంక్షన్ హాల్‌లో క్యాసినో నిర్వహించారని టీడీపీ సహా, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. గుడివాడ క్యాసినో వ్యవహారంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీల పాత్ర ఉందని ఆరోపించిన టీడీపీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే‌ట్ సహా, పలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ఐటీ అధికారులు.. ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని వర్ల రామయ్యకు నోటీసులు పంపింది. 

click me!