
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేడు కోర్టుకు వచ్చారు. చెక్‌బౌన్స్ కేసులో విశాఖ జిల్లా కోర్టుకు ముందు ఆమె హాజరయ్యారు. గతంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి అనిత అప్పు తీసుకున్నారు. అయితే ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. అనితపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు అనిత కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసు వ్యక్తిగత వ్యవహారం అని వంగలపూడి అనిత చెప్పారు.
ఇక, శ్రీనివాసరావు సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. వంగలపూడి అనిత 2015 అక్టోబర్ నెలలో అతని వద్ద రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారని శ్రీనివాసరావు గతంలో చెప్పారు. అందుకు సంబంధించి ప్రామిసరీ నోటు, పోస్ట్ డేటెడ్ చెక్కును అనిత ఇచ్చారని తెలిపారు. అయితే చాలా రోజుల పాటు ఆ చెక్కును బ్యాంకులో వేయొద్దంటూ శ్రీనివాసరావును ఆమె కోరుతూ వచ్చారని.. ఇంటి నిర్మాణానికి సంబంధించి బ్యాంకు లోన్ పెట్టానని, వచ్చిన వెంటనే మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని అనిత చెబుతూ వచ్చారని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తన అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో.. 2018 జూలై 30న రూ.70 లక్షల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెక్కును అనిత ఇచ్చారని తెలిపారు. ఆ చెక్కును బ్యాంకులో వేస్తే అకౌంట్లో బ్యాలెన్స్ లేదని బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావుకు లేఖ పంపారని తెలిపారు. దీంతో తాను కోర్టును ఆశ్రయించారని వెల్లడించారు.