ఒక్క ఏప్రిల్ లోనే... ఏపీలో జరిగిన నేరాలు ఘోరాల లిస్టిది..: చంద్రబాబు సంచలన డాటా విడుదల

Arun Kumar P   | Asianet News
Published : May 02, 2022, 05:01 PM IST
ఒక్క ఏప్రిల్ లోనే... ఏపీలో జరిగిన నేరాలు ఘోరాల లిస్టిది..: చంద్రబాబు సంచలన డాటా విడుదల

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత నెలలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, నేరాలు, రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టారు. 

అమరావతి: జగన్ సర్కార్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ కాస్త నరకాంద్ర ప్రదేశ్ గా మారిందని మాజీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులకు సంబంధించి 31 ఘటనలు జరగడం. 26 మంది రైతులు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో దుస్థితికి అద్దంపడుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు.   

పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమై ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆయన పార్టీ నేతలతో పంచుకున్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని... అసలు వ్యవసాయ శాఖ అనేది ఉందా అనే అనుమానం కలిగేలా పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. నెలలో 26 మంది రైతుల బలవన్మరణాలు జరిగినా... ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని చంద్రబాబు విమర్శించారు. 

 రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయాలు, అసమర్థత కారణంగా ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతిందని టీడీపీ అధినేత అభిప్రాయ పడ్డారు. ఈ కారణంగా ఉపాధి కోసం యువత, ఆయా వర్గాల ప్రజలు వలసపోతున్నారని చంద్రబాబు అన్నారు. ఈ పరిణామం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. 

మహిళలపై దాడులు -నేరాలు, వ్యవసాయ రంగం సంక్షోభం – రైతుల ఆత్మహత్యలపై పార్టీ పరంగా రెండు వేరు వేరు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు వర్గాల సమస్యలు, పోరాటం, పరిష్కారం కమిటీ సూచనల ఆధారంగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

ముఖ్యనేతల సమావేశంలో చర్చించిన పలు ఇతర అంశాలు:-

1. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ నేత కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతల దాడి చెయ్యడాన్ని, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ కు వెళ్తున్న టీడీపీ నాయకుడు చలపతినాయుడుపై వైసిపి నేతలు దాడికి పాల్పడటాన్ని సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకూ పెట్రేగిపోతున్నాయని, బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేతలు వ్యాఖ్యానించారు. 

2. శ్రీ సత్యసాయి జిల్లా సంజీవరాయనపల్లిలో తల్లికి పింఛన్ ఇవ్వలేదని ప్రశ్నించిన కుమారుడిపై వైసీపీ నేతలు, ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేయడాన్ని సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండించారు. ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితుడిని బెదిరించడం దారుణమన్నారు. వేణుపై దాడిచేసిన వైసీపీ నేతలు, ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

3. ప్రజలపై పన్నుల భారం, ఛార్జీల పెంపుతో పాటు నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. పన్నుల బాదుడు, అధిక ధరలపై స్వయంగా మహిళలు అధికార పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారని అన్నారు. 

4. టీడీపీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఈ కార్యక్రమం త్వరితగతిన కొనసాగేందుకు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి త్వరలోనే సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, కాలవ శ్రీనివాసులు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్,   బండారు సత్యనారాయణ మూర్తి,  కేఎస్ జవహర్,  బోండా ఉమామహేశ్వరరావు,  నిమ్మల రామానాయుడు,  ఏలూరి సాంబశివరావు,  బీద రవిచంద్ర యాదవ్,  టీడీ జనార్థన్,  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,  పి.అశోక్ బాబు,   కొమ్మారెడ్డి పట్టాభిరాం,  మద్దిపాటి వెంకటరాజు,  చింతకాయల విజయ్ పాత్రుడు,  జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu