గుంటూరు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య... చంద్రబాబు సీరియస్, స్వయంగా రంగంలోకి...

By Arun Kumar PFirst Published Jan 13, 2022, 12:24 PM IST
Highlights

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్ల‌పాడు గ్రామ టిడిపి అధ్య‌క్షుడు తోట చంద్ర‌య్య హ‌త్య‌పై స్పందిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. 

గుంటూరు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం గుండ్ల‌పాడులో టిడిపి గ్రామ అధ్య‌క్షుడు  తోట చంద్ర‌య్య (thota chandraiah murder) హ‌త్య‌ను ఆ పార్టీ అధినేత‌ నారా చంద్ర‌బాబు నాయుడు (nara chandrababu naidu) తీవ్రంగా ఖండించారు. మరికొద్ది సేపట్లో హత్యకు గురయిన చంద్ర‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు చంద్రబాబు గుండ్ల‌పాడు వెళ్ల‌నున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గుండ్లపాడు (gundlapadu murder)లో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు.

చంద్రయ్య హత్యపై చంద్రబాబు స్పందిస్తూ... వైసిపి (ycp) అరాచ‌క పాల‌న‌లో ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌దుల సంఖ్య‌లో టిడిపి కార్య‌క‌ర్త‌ల ప్రాణాలు కోల్పోయారని అన్నారు. జ‌గ‌న్ రెడ్డి దారుణ పాల‌న‌పై తిర‌గ‌బ‌డుతున్న టిడిపి (TDP) క్యాడ‌ర్ ను, ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టేందుకే వైసిపి హ‌త్యాంకాండ సాగిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

''వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప‌ల్నాడులోనే ఇప్ప‌టికి ప‌దుల సంఖ్య‌లో రాజ‌కీయ హ‌త్య‌లు జ‌రిగాయి. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ కార్య‌క్ర‌మానికి వెళ్లిన టిడిపి నేత‌లు బోండా ఉమా (Bonda Uma), బుద్దా వెంక‌న్న‌ (budda venkanna)ల‌పై హ‌త్యాయ‌త్నం చేశారు. ఆనాడే పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని ఉంటే వైసిపి బ‌రితెగింపుకు అడ్డుకట్ట ప‌డేది. దాడులు చేసిన వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి త‌న విష సంస్కృతిని జ‌గ‌న్ చాటుకున్నారు'' అని మండిపడ్డారు. 

''వైసిపి మూక చేతిలో హ‌త్య‌కు గుర‌యిన చంద్ర‌య్య కుటుంబానికి టిడిపి అండ‌గా ఉంటుంది. అంతేకాదు వైసిపి మూకల చేతిలో దాడికి గురయిన ప్రతి టిడిపి నాయకుడు, కార్యకర్తకు అండగా వుంటాను... ఎవ్వరూ భయపడకండి'' అని చంద్రబాబు ధైర్యం చెప్పారు.

ఇదిలావుంటే మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా చంద్రయ్య హత్యపై స్పందిస్తూ వైసిపి నాయకులపై సీరియస్ అయ్యారు. హత్యా రాజకీయాల వారసుడు జగన్ రెడ్డి సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందని లోకేష్ ఆరోపించారు. 

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు గ్రామంలో వైసిపి ఫ్యాక్షన్ మూకలు టిడిపి గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు మండిపడ్డారు.  ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేసారు. అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలన్నారు. చంద్రయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు.  

ఇక ఈ దారుణ హత్యపై టిడిపి ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే పల్నాడులో వైసీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇకపై వైసీపీ హత్యా రాజకీయాలను సహించం... ఇప్పటి నుంచి మరో  టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

పల్నాడులో వైసీపీ హత్యారాజకీయాలు రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయని... చంద్రయ్య ఉంటే  గుండ్లపాడులో వైసీపీకి మనుగడ ఉండదని భావించి దారుణంగా హత్య చేశారన్నార. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,  పల్నాడులో ‎ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  హత్యా రాజకీయాల్ని పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయని అచ్చెన్న ఆరోపించారు. 


 

click me!