Guntur TDP leader Murder: ఇకపై మా కార్యకర్తపై చెయ్యేసినా తీవ్ర పరిణామాలు..: లోకేష్, అచ్చెన్న వార్నింగ్

By Arun Kumar PFirst Published Jan 13, 2022, 11:27 AM IST
Highlights

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని గుండ్లపాడు గ్రామ టిడిపి అధ్యక్షులు తోట చంద్రయ్య దారుణ హత్యపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. 

అమరావతి: గుంటూరు జిల్లా (guntur district) మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం గుండ్ల‌పాడులో టిడిపి గ్రామ అధ్య‌క్షుడు తోట చంద్ర‌య్య (thota chandraiah) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య (guntur murder)తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయంగా ఎదుర్కోలేకే వైసిపి రౌడీమూకల హత్యారాజకీయాలు తెగబడుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రయ్య హత్యకు టిడిపి నాయకులు  తీవ్రంగా ఖండిస్తున్నారు. 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ (nara lokesh) చంద్రయ్య హత్యపై స్పందిస్తూ వైసిపి నాయకులపై సీరియస్ అయ్యారు. హత్యా రాజకీయాల వారసుడు జగన్ రెడ్డి సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందని లోకేష్ ఆరోపించారు. 

''పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు గ్రామంలో వైసిపి ఫ్యాక్షన్ మూకలు టిడిపి గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.  ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి. అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలి. చంద్రయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది'' అని లోకేష్ పేర్కొన్నారు.  

ఇక ఈ దారుణ హత్యపై టిడిపి ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు (kinjarapu atchannaidu) స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (ys jagan) ప్రోద్బలంతోనే పల్నాడులో వైసీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇకపై వైసీపీ హత్యా రాజకీయాలను సహించం... ఇప్పటి నుంచి మరో  టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

''పల్నాడు (palnadu)లో వైసీపీ హత్యారాజకీయాలు రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.  చంద్రయ్య ఉంటే  గుండ్లపాడులో వైసీపీ (ycp)కి మనుగడ ఉండదని భావించి దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,  పల్నాడులో ‎ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (pinnelli ramakrishna reddy) హత్యా రాజకీయాల్ని(murder politics) పెంచిపోషిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయి'' అని అచ్చెన్న ఆరోపించారు. 

''రెండున్నరేళ్ల కాలంలో అనేక మంది టీడీపీ కార్యకర్తలను బలితీసుకున్నారు. ఇక నుంచి వైసీపీ వైసీపీ అరాచకాల్ని సహించేది లేదు. నేటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయి. చంద్రయ్య కుటుంబానికి 60 లక్షల టీడీపీ కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటారు. చంద్రయ్యను హత్య చేసిన వారిని, హత్య చేయించిన వారిని ‎పోలీసులు కఠినంగా శిక్షించాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. 

గుండ్లపాడు గ్రామ సెంటర్ లో చంద్రయ్య కూర్చున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. చంద్రయ్యను హత్య చేసిన తర్వాత దుండగులు పారిపోయారు. స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపారు.  ఈ ఘటనకు సంబంధించి మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

click me!