
కడప : టిడిపి పోలీసు బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి సతీమణి మాధవి కడపలో మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆమె మాట్లాడుతూ.. అంగళ్లు ఘటన జరిగిన రోజు తన భర్త హైదరాబాదులో ఉన్నాడని తెలిపారు. అంగళ్లు ఘటనలతో తన భర్త శ్రీనివాసులు రెడ్డికి సంబంధం లేదని.. అయినా కూడా ఆయన మీద పోలీసులు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఆగస్టు మూడవ తేదీన హైదరాబాద్ కు వెళ్ళామని.. తిరిగి ఆగస్టు ఏడవ తేదీన కడపకు తిరిగి వచ్చామని మాధవి విలేకరులకు తెలిపారు. తాము ఊర్లో లేకపోయినా పోలీసులు అక్రమంగా కేసులు పెట్టిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించామని అన్నారు. సీసీకి కెమెరా ఫుటేజ్, ఇతర సాక్షాదారాలతో కోర్టులో పిటిషన్ వేసామని మాధవి చెప్పారు.
అసలు ఘటన స్థలంలోనే లేని వ్యక్తి మీద హత్యాయత్నం కేసు పెట్టడమేమిటంటే ఆమె నిలదీశారు. తన భర్త శ్రీనివాసులు రెడ్డి రానున్న ఎన్నికల్లో టిడిపి నుంచి కడప లోక్సభ స్థానంలో పోటీ చేయబోతున్నారని అన్నారు. దీని కోసమే ఆయనను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని.. ఈ ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్లో ఏ11గా చేర్చడం దారుణమని మండిపడ్డారు.
తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చెబుతుంటే అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా పోలీసులు తప్పుడు కేసులు పెడతారా? అంటూ మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులపై తాను న్యాయపరంగా పోరాడతామని శ్రీనివాసులు రెడ్డి భార్య మాధవి అన్నారు.