
Payyavula Keshav: ఏపీలో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విభజన సమస్యల పరిష్కారానికి నియమించిన సబ్ కమిటీ ఎజెండాలో ప్రత్యేక హోదా చేర్చి మళ్లీ కేంద్రం తొలగించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.
వైసీపీ నేతలు ప్రత్యేక హోదా వచ్చేసినట్టు నిన్న సాయంత్రం వరకు గొప్పలు చెప్పారు.. సాయంత్రానికి కేంద్రం మాట మారిస్తే.. అది చంద్రబాబు వలనే అంటూ ప్రచారం చేశారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆయన అనంతపురంలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ నేతల వ్యవహర శైలిపై టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు.
ఎంపీలు 25 మంది ఇస్తే యుద్ధం చేయొచ్చు అన్న జగన్ హోదా సాధిస్తాం అన్నారు... ఏమైంది మీ యుద్ధమని ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతకాని తనం వలనే ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి జనవరి 3న సీఎం జగన్ వినతిపత్రం ఇచ్చారని, అందులో ప్రత్యేక హోదా అంశమే లేదని ఆరోపించారు. కనీసం ఆ విషయాన్ని ప్రస్తావించలేదని ఆరోపించారు. యుద్ధం..కేంద్రం మీద ప్రకటించండి.. ప్రజలతో పాటు టీడీపీ కూడా మీ వెంటే ఉంటుందని వైసీపీ నేతలకు పయ్యావుల కేశవ్ సూచించారు. వైసీపీ నేతలకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.. మీరు యుద్ధం చేయకుండానే.. యుద్ధం నుంచి తప్పుకుంటున్నారని ఆరోపించారు.
వైసీపీకి . బీజేపీ కి దృఢమైన సంబంధం ఉందనీ, ప్రతి బిల్లుకు అడగకుండానే మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు.చంద్రబాబు చెబితే.. అజెండాలో అంశాలు తీసేశారు అంటున్నారు. మీ ఎంపీలు అంత అసమర్థులా...? చంద్రబాబు ఇప్పటికీ కేంద్రాన్ని సశాసించే అంత బలంగా కనిపిస్తున్నారా...? అని ప్రశ్నించారు. ఇకనైనా వాస్తవాలు మాట్లాడండని సూచించారు.
రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేస్తున్నారా? లేక, జగన్ ను ప్రధానమంత్రి మోసం చేస్తున్నాడా? అనేది ప్రజలకు తెలియాలనీ, జగన్ పలుకే బంగారమయ్యిందనీ, ఆయన పలుకు కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోందని విమర్శించారు. జగన్.. పల్లె పల్లే తిరిగి చెప్పారు.. హోదా వస్తే పరిస్థితి మారిపోతుందని జగన్ అన్నారు. మరీ 151 మందిని ఇస్తే.. ఎందుకు కేంద్రం ముందు అంతలా సాగిలా పడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా పై ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.
మీతో నరేంద్ర మోడీ ఏమన్నారో.. మీరు దానికి ఏం చెప్పారో వెల్లడించాలని కోరారు.. మీరు పాల్గొనే జూమ్ మీటింగ్ లింక్ అందరికీ ఇవ్వండి.. ప్రధాని ఎం చెప్పారు అన్నది బహిర్గతం చేయాలి.. అప్పుడే ఎవర్ని ఎవరు మోసం చేస్తున్నారో తెలుస్తుందని పయ్యావుల కేశవ్ నిలదీశారు .
సీఎం మౌనం వీడితేనే.. అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందనీ, 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలు ఉన్నా.. ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేక పోతున్నారని విమర్శించారు. గతం లో ఎంపీలు రాజీనామా చేయడమే మార్గం అని చెప్పిన జగన్ కు ఆ అంశం గుర్తు చేస్తున్నా...ఇప్పటికైనా సిద్ధం కండని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు
ఈ విషయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా సీఎం జగన్ ను విమర్శించారు. కేసుల మాఫీ కోసం ప్రజల ఆకాంక్షలు తాకట్టు.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి తాకట్టుపెట్టారని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి జగన్ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన నటనకు మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఏద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తన పెయిడ్ ఆర్టిస్టులతో హోదా డ్రామాలాడి ఇప్పుడు నోరు మెదపడం లేదనీ, రాష్ట్రంలో ప్రత్యేక హోదాను ఎక్కడా వినిపించకుండా బ్యాన్ చేశారని విమర్శించారు.