కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: కీలక వివరాలు వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌

Published : Feb 13, 2022, 05:11 PM IST
కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: కీలక వివరాలు వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ కీలక వివరాలు వెల్లడించారు. కొత్త జిల్లాలపై మార్చి 3 వరకు సూచనలు తీసుకోనున్నట్లు చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ కీలక వివరాలు వెల్లడించారు. కొత్త జిల్లాలపై మార్చి 3 వరకు సూచనలు తీసుకోనున్నట్లు చెప్పారు. విజయ్‌కుమార్ ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జిల్లాలపై మార్చి 3వ తేదీ వరకు కలెక్టర్లకు సూచన ఇవ్వొచ్చని తెలిపారు. సూచనలు అన్నింటినీ పరిశీలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్టుగా చెప్పారు. మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఏప్రిల్ 2న ఉగాది నుంచి కొత్త జిల్లా నుంచి పాలన ప్రారంభమవుతుందని అన్నారు. 

 కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌లు నిర్మిస్తామని, ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటుచేస్తామని విజయ్‌కుమార్‌ తెలిపారు. 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్‌లు నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి నోటిఫై కోసం సమాచారం ఇస్తామని వివరించారు. జిల్లాలు ఏర్పాటుకు కేంద్రం అనుమతి అవసరం లేదని..జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం నోటిఫై చేస్తుందన్నారు. 

మార్చి నెలలో అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేపడతామని తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్లు, సర్వీస్‌కి ఇబ్బందులు ఉండవని.. వర్క్ టు సెర్వ్ కింద ఉద్యోగులను కేటాయిస్తామని చెప్పారు. రెండు చోట్ల మాత్రమే ఉద్యోగుల జోనల్ సమస్యలు ఉంటాయని చెప్పారు

ఇక, ఏపీలో ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా 13 జిల్లాలను కలుపుతూ 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉగాది నుంచే రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులకు సీఎం జగన్ సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహాలు చేసుకోవాలన్నారు. మార్చిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 

అభ్యంతరాల పరిశీలనకు కమిటీ..
కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను  క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు.  కొత్త జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www. drp.ap.gov.in వెబ్‌ సైట్‌లో ప్రతీరోజూ అప్‌లోడ్‌ చేయాల్సి వుంటుంది. ఇలా అప్‌లోడ్‌ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి.

ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి అది సహేతుకమైనదా? పరిగణలోకి తీసుకోవాలా లేదా? అని నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి అభ్యంతరం, పరిశీలనను స్వీకరించాలా? తిరస్కరించాలో? చెబుతూ ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu